Mumbai Special Sandwich Recipe :డైలీ బ్రేక్‌ఫాస్ట్ లేదా స్నాక్స్ టైమ్‌లో ఒకే రకం ఆహారాలను పెడితే ఎవరికైనా నచ్చదు. అందుకే మీకోసం ఈ సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే, ముంబయి స్ట్రీట్ స్టైల్ "శాండ్విచ్". పిల్లలు ఎంతో ఇష్టంగా తినే శాండ్‌విచ్‌ని ఇంట్లోనే ఈ టిప్స్ పాటిస్తూ తయారు చేసి ఇవ్వండి. ముంబయి స్ట్రీట్స్‌లో దొరికే వాటికి ఏమాత్రం తీసిపోకుండా నోరూరిస్తోంది. ఈ శాండ్‌విచ్‌ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్లీ మళ్లీ తప్పక కావాలంటారు. మరి, ఈ సూపర్ టేస్టీ శాండ్విచ్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
స్టఫింగ్ కోసం :
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- ఆవాలు - అరటీస్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- కరివేపాకు - 1 రెమ్మ
- ఇంగువ - 2 చిటికెళ్లు
- పసుపు - పావుటీస్పూన్
- పచ్చిమిర్చి - 2
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- ఉడికించిన ఆలూ - 2
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- ఉడికించిన పచ్చిబఠాణీ - పావు కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
బేకరీ స్టైల్ "ఫ్రైడ్ చికెన్ శాండ్విచ్" - ఇలా చేస్తే ఒక్కటీ మిగల్చరు!
శాండ్విచ్ అసెంబుల్ కోసం :
- శాండ్విచ్ బ్రెడ్ స్లైసులు - 4
- బటర్ - తగినంత
- పుదీనా చట్నీ
- కీర దోస - 1
- టమాటా స్లైసులు - 6
- క్యాప్సికం రింగులు - 6
- ఆనియన్ - 1
- బీట్రూట్ స్లైసులు - 2
- చాట్ మసాలా - కొద్దిగా
- చీజ్ - కొద్దిగా
తయారీ విధానం :
- మొదటగా ఈ రెసిపీలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి చిట్లనివ్వాలి.
- ఆ తర్వాత అందులో కరివేపాకు, ఇంగువ, పసుపు, సన్నని పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా వేయించుకోవాలి.
- తాలింపు వేగాక మెత్తగా ఉడికించుకున్న ఆలూనుచేతితో చిదిమి వేసుకోవాలి. ఆపై సన్నని కొత్తిమీర తరుగు వేసి ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. అనంతరం గరిటెతో ఆలూని మెత్తగా మాష్ చేసుకుంటూ కొద్దిసేపు వేయించుకోవాలి.
- ఆ తర్వాత మెత్తగా ఉడికించుకున్న పచ్చిబఠాణీ, ఉప్పు వేసుకొని కలిపి బఠాణీని కూడా కచ్చాపచ్చాగా మాష్ చేసుకోవాలి. ఇక చివర్లో మరికొద్దిగా సన్నని కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. ఆపై దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు శాండ్‌విచ్‌ని అసెంబుల్ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా ఒక్కో శాండ్విచ్ బ్రెడ్ స్లైస్‌ని తీసుకొని 1 టీస్పూన్ చొప్పున బటర్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కో బ్రెడ్ స్లైస్ మీద 1 టీస్పూన్ చొప్పున పుదీనా చట్నీని అప్లై చేసుకోవాలి.
- అనంతరం పుదీనా అప్లై చేసుకున్న రెండు బ్రెడ్ స్లైసుల మీద సన్నని బటర్ స్లైసెస్ పెట్టుకోవాలి. ఆపై పుదీనా చట్నీ అప్లై చేసుకున్న మరో రెండు బ్రెడ్ స్లైసుల మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలూ స్టఫింగ్‌ని కొద్దిగా వేసుకొని పల్చగా అంచుల దాకా రాకుండా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టఫ్ చేసుకున్న ఒక బ్రెడ్ స్లైస్ మీద ఆలూ స్లైసర్‌తో సన్నగా తరుకున్న ఒక ఐదు కీర స్లైసులు పెట్టాలి. ఆపై వాటి మీద 1 బీట్రూట్, కొన్ని ఆనియన్ రింగ్స్, మూడు నాలుగు టమాటాస్లైసులు, 3 క్యాప్సికం స్లైసులు ఒకదాని తర్వాత ఒకటి చక్కగా సర్దాలి.
- ఆ తర్వాత వాటిపై కాస్త చాట్ మసాలా చల్లుకోవాలి. ఇలానే మరో స్టఫ్డ్ బ్రెడ్ స్లైసు మీద కూరగాయ ముక్కలను సర్ది చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకోవాలి.
అద్దిరిపోయే స్ట్రీట్ ఫుడ్ "స్పైసీ ఉల్లి మిక్చర్" - ఇంట్లోనే 5 నిమిషాల్లో ప్రిపేర్ చేయండి!
- ఇప్పుడు చీజ్ స్లైస్ పెట్టుకున్న బ్రెడ్ స్లైసును ఆలూ స్టఫింగ్ ఉన్న బ్రెడ్ మీద పెట్టి కాస్త దబాయించి ఒత్తాలి. అప్పుడు ఆ బ్రెడ్ స్లైస్ అంటి పట్టి నిలిచి ఉంటుంది. ఇలానే ఇంకో బ్రెడ్ స్లైసును సిద్దం చేసుకోవాలి.
- ఆ తర్వాత పైన పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ మీద పల్చని పూతలా కాస్త బటర్ని పూయాలి. దీంతో శాండ్విచ్ స్టఫింగ్ కంప్లీట్ అవుతుంది.
- అనంతరం శాండ్విచ్ గ్రిల్లర్ తీసుకొని అందులో పైన, కింద అంతా బటర్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత బటర్ అప్లై చేసుకున్న బ్రెడ్ స్లైసుని అడుగుకి పెట్టి శాండ్‌విచ్‌ని మౌల్డ్‌లో సరిగ్గా సర్దుకోవాలి. ఆపై గ్రిల్లర్ లిడ్‌ని గట్టిగా క్లోజ్ చేస్తే బ్రెడ్ అంచులు ఈజీగా కట్ అయిపోయి శాండ్విచ్ ఆ మౌల్డ్‌లో మంచిగా సర్దుకుంటుంది.
- ఇప్పుడు ఆ శాండ్విచ్ గ్రిలర్ని స్టౌపై మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా కాలనివ్వాలి. ఒకవైపు నిమిషం పాటు కాల్చుకున్నాక టర్న్ చేసుకొని మరోవైపు కూడా కాల్చుకోవాలి. ఇలా నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు శాండ్విచ్ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకోవాలి.
- అనంతరం గ్రిల్లర్ మూత తీసి శాండ్‌విచ్‌ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఆ తర్వాత దాని మీద వన్‌సైడ్ పల్చగా 1 టీస్పూన్ పుదీనా చట్నీని పూయాలి. ఆపై కొద్దిగా బాంబే సేవ్ చల్లి దానిపై కాస్త చీజ్‌ని తురుమి వేసుకోవాలి.
- ఇక చివరగా మీక నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, నోరూరించే ముంబయి స్పెషల్ "శాండ్విచ్" రెడీ.
- ఆపై దీన్ని వేడి వేడిగా టమాట సాస్‌తో తింటే సూపర్‌గా ఉంటుంది. మరి నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తారు.
వింటర్ స్పెషల్ - యమ్మీ యమ్మీ "చికెన్ సమోసా" - ఈవెనింగ్ టైమ్ పర్ఫెక్ట్ స్నాక్!