Kakarakaya Chips Recipe in Telugu :మనందరికీ చిప్స్ అనగానే బంగాళదుంపతో ప్రిపేర్ చేసుకునేవే ముందుగా గుర్తొస్తాయి. కరకరలాడుతూ ఉండే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే, ప్రతిసారీ ఒకేలా తినాలంటే ఎవరికైనా బోరింగ్‌గా అనిపిస్తోంది. అందుకే ఈసారి కాస్త వెరైటీగా ఇలా "కాకరకాయ చిప్స్" ట్రై చేయండి. ఇవి కూడా చాలా రుచికరంగా ఉండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అంతేకాదు, కాకరకాయఅంటే నచ్చని వారూ ఇంకా ఇంకా కావాలని అడిగి మరీ తినేస్తారు. మరి, ఈ సూపర్ టేస్టీ చిప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- కాకరకాయలు - 3
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - అరటీస్పూన్
- మైదా - 1 టేబుల్‌స్పూన్
- బియ్యప్పిండి - 2 టేబుల్‌స్పూన్లు
- కార్న్‌ఫ్లోర్ - 1 టేబుల్‌స్పూన్
- వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- కారం - రుచికి తగినంత
- ఆయిల్ - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి చాకు లేదా పీలర్ సహాయంతో వాటిపై ఉండే చెక్కును తొలగించుకోవాలి. ఆపై వాటిని మీకు నచ్చిన షేప్‌లో సన్నని ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలో గింజలను తీసేసుకోవాలి.
- అనంతరం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని కాస్త ఉప్పు, పావు టీస్పూన్ పసుపువేసి బాగా కలిపి పది నిమిషాల పాటు పక్కనుంచాలి.
- 10 నిమిషాల తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి ఆపై ముక్కలన్నింటినీ చేతితో గట్టిగా పిండి మరో మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కాకర ముక్కల్లోని చేదు చాలా వరకు తగ్గుతుంది.
- ఆ తర్వాత అందులో మైదా, బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్, వెల్లుల్లి పేస్ట్, పావుటీస్పూన్ పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కాకర ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి.
- అలా మిక్స్ చేసుకునేటప్పుడు అవసరమనుకుంటే కొద్దికొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పకోడీపిండి మాదిరిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని కాకరకాయ ముక్కలను ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఎర్రగా, క్రిస్పీగా మారేంత వరకు వేయించుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక వాటిని పేపర్ నాప్కిన్ వేసుకొన్న ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే "కాకరకాయ చిప్స్" రెడీ!