Raw Banana Bajji Recipe in Telugu :సాయంత్రం అయ్యిందంటే చాలు ఎక్కువ మందికి ఏదో ఒక స్నాక్ తినే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఇంట్లో మిర్చి, ఆలూ, ఎగ్ బజ్జీ, పకోడి, సమోసా వంటివి ప్రిపేర్ చేసుకుంటుంటారు. లేదంటే బయటకు వెళ్లి తింటుంటారు. కానీ, ఎప్పుడూ రొటీన్‌గా అవే తింటే బోరింగ్ ఫీల్ కలుగుతుంది. అందుకే.. ఈసారి కాస్త డిఫరెంట్‌గా ఇలా "అరటికాయ బజ్జీని" ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా తక్కువ నూనె పీల్చడమే కాకుండా చాలా క్రిస్పీగా, టేస్టీగా కూడా వస్తాయి! వంటసోడా వేయకుండా చేసే వీటిని తిన్నాకొద్దీ తినాలనిస్తుంది. పైగా చేయడం కూడా చాలా తేలిక! మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- పచ్చి అరటికాయ - 1
- శనగపిండి - ఒకటిన్నర కప్పులు
- బియ్యప్పిండి - 2 టేబుల్‌స్పూన్లు
- పసుపు - పావు చెంచా
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - ముప్పావు చెంచా
- జీలకర్ర - 1 టీస్పూన్
- నూనె - తగినంత
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా పచ్చి అరటికాయను శుభ్రంగా కడిగి తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఆపై చాకు సహాయంతో అరటికాయ పై చెక్కును చాలా సన్నగా తీయాలి. అంతేకానీ.. మరీ మందంగా, తెల్లగా లోపల కండ కనపడే విధంగా మాత్రం చెక్కును అస్సలు తీయవద్దు.
- ఆవిధంగా అరటికాయ నార తీసుకున్నాక దాన్ని పావు అంగుళం మందం ఉండేలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండిని తీసుకోవాలి. ఆపై అందులో బియ్యప్పిండి, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర వేసి ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత అందులో 2 టీస్పూన్ల వేడివేడి నూనె వేసుకొని మరోసారి పిండిని చక్కగా కలుపుకోవాలి. పిండిలో కొద్దిగా వేడివేడి నూనె వేసి కలుపుకోవడం వలన వంటసోడా వేసుకోవాల్సిన అవసరం పడదు. కాబట్టి, అది వేయకపోయినా బజ్జీలుగుల్లగా వస్తాయి.
- అనంతరం ఆ మిశ్రమంలో తగినన్ని వాటర్‌ని కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండి మాదిరిగా కలుపుకోవాలి.
- ఇక్కడ బజ్జీల పిండి ఎంత థిక్‌గా ఉండాలనే దానికి ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుంది. అదేంటంటే.. మీరు ప్రిపేర్ చేసుకున్న పిండిలో వేలు ముంచి తీస్తే ఫింగర్‌కి ఏ మందాన పిండి అంటుకుని ఉంటుందో అదే పరిమాణంలో అరటికాయకు అంటుకుంటుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి, అందుకు తగిన విధంగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకుంటే సరిపోతుంది.
- ఆవిధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక.. ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని వేయించడానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. నూనెవేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను పిండిలో ముంచి ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
- ఆపై ముందుగా మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవిధంగా వేయించుకున్నాక మంటను హై ఫ్లేమ్‌కి టర్న్ చేసుకొని మరోసారి క్రిస్పీగా, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- అలా వేయించుకున్నాక గరిటెతో తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే "అరటికాయ బజ్జీలు" రెడీ!
- ఇక వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే టమాటా సాస్ లేదా ఏదైనా పచ్చడిలో అద్దుకొని తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ అద్భుతమని చెప్పుకోవచ్చు! మరి, నచ్చిందా మీరు ఓసారి ఇలా అరటికాయ బజ్జీలను ప్రిపేర్ చేసుకొని తినండి. ఇంటిల్లిపాదీ ఎంజాయ్ చేయండి!