తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

వింటర్ స్పెషల్ - ఘుమఘుమలాడే "ఉసిరికాయ పప్పు" - ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు! - USIRIKAYA PAPPU RECIPE

ఉసిరికాయలతో పచ్చడి, పులిహోర మాత్రమే కాదు - ఓసారి ఇలా పప్పుని ప్రిపేర్ చేసుకోండి!

USIRIKAYA PAPPU RECIPE
Amla Dal Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2024, 4:00 PM IST

Amla Dal Recipe in Telugu :చలికాలంలో ఉసిరికాయలు విరివిగా లభిస్తుంటాయి. ఈ క్రమంలో చాలా మంది అవి ఆరోగ్యానికి మంచిదని రోటి పచ్చడి, ఉసిరి ఊరగాయ, పులిహోర, ఆమ్లా రైతా.. ఇలా రకరకాల రెసిపీలను ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ, ఓసారి ఇలా "ఉసిరికాయలతో పప్పు" కర్రీని తయారుచేసుకొని ఆరగించండి. వేడి వేడి అన్నంలో నెయ్యి, ఉసిరికాయ పప్పు కాంబినేషన్ వేరే లెవల్​లో ఉంటుంది! ఇంతకీ, ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • కంది పప్పు - అర కప్పు
  • ఉసిరికాయలు - 6
  • పసుపు - అరటీస్పూన్
  • పచ్చిమిర్చి - తగినన్ని
  • నూనె - 3 నుంచి 4 టేబుల్​స్పూన్లు
  • మెంతులు - పావుటీస్పూన్
  • ఆవాలు - 1 టీస్పూన్
  • ఎండుమిర్చి - 2
  • శనగపప్పు - 1 టేబుల్​స్పూన్
  • జీలకర్ర - అరటీస్పూన్
  • కరివేపాకు - 3 రెమ్మలు
  • వెల్లుల్లి రెబ్బలు - 10
  • ఇంగువ - చిటికెడు
  • ఉల్లిపాయ తరుగు - అరకప్పు
  • టమాటాలు - 2
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

అప్పటికప్పుడు తయారు చేసే "కమ్మటి ఉసిరికాయ చట్నీ"- ఇలా చేస్తే టేస్ట్​ అద్భుతంగా ఉంటుంది!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక బౌల్​లో కందిపప్పుని శుభ్రంగా కడిగి సుమారు గంటపాటు నానబెట్టుకోవాలి.
  • అనంతరం స్టౌపై మరో గిన్నెలో ఉసిరికాయలను మునిగే వరకు వాటర్ తీసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద అవి మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. అందుకోసం సుమారు 12 నుంచి 15 నిమిషాల వరకు సమయం పట్టొచ్చు.
  • అయితే, మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. 80% వరకు ఉడికితే సరిపోతుంది. ఆవిధంగా ఉడికించుకున్నాక పాన్​ని దించి ఉసిరికాయలను చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పుని వాటర్ వడకట్టి కుక్కర్​లోకి తీసుకోవాలి. అలాగే పావుటీస్పూన్ పసుపు, మూడు పచ్చిమిర్చి చీలికలు, ఒకటిన్నర కప్పుల వాటర్ యాడ్ చేసుకొని మూతపెట్టి మీడియం ఫ్లేమ్​ మీద 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
  • పప్పు ఉడికేలోపు చల్లారిన ఉసిరికాయలను తీసుకొని గింజలు వేరు చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు, మీరు తినే కారానికి తగినన్ని పచ్చిమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక మెంతులు వేసుకొని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఆపై ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.
  • ఆ తర్వాత ఎండుమిర్చి, శనగపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. ఆపై కరివేపాకు, కాస్త క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఇంగువ కూడా వేసి వేపుకోవాలి.
  • తాలింపు చక్కగా వేగాక ఉల్లిపాయతరుగు వేసుకొని అవి మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పండిన టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు వేసుకొని కలిపి టమాటాలపై స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి.
  • అలా ఉడికించుకున్నాక ఆ మిశ్రమంలో కుక్కర్​లో మెత్తగా ఉడికించుకున్న పప్పును యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ పేస్ట్​ని వేసి కలుపుకోవాలి. అవసరమైతే ఉసిరికాయలను ఉడికించిన వాటర్​ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద మరో 3 నుంచి 4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
  • అనంతరం మూతతీసి కలిపి ఉప్పు సరిచూసుకొని చివరగా కొత్తిమీరతరుగు వేసి కలుపుకొని దింపేసుకుంటే చాలు. అంతే.. ఘుమఘుమలాడే "ఉసిరికాయ పప్పు" రెడీ!
  • మరి, ఆలస్యమెందుకు నచ్చితే మీరూ ఓసారి ఇలా ఉసిరికాయలతో పప్పు కర్రీని ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు!

సీజనల్​ స్పెషల్​ - ఘాటైన రుచితో "ఉసిరికాయ రసం" - ఇలా చేసుకుని తింటే ఎన్నో ప్రయోజనాలు​!

ABOUT THE AUTHOR

...view details