Ajwain Rasam Recipe in Telugu :చలికాలం చాలా మందిని రకరకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. అందులో ప్రధానంగా జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలు ఎక్కువగా ఇబ్బందిపెడుతుంటాయి. అయితే, అలాంటి టైమ్లో ఎన్నో ఔషధ గుణాలు కలిగిన వాముతో ఇలా చారుని ప్రిపేర్ చేసుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది! ముఖ్యంగా నాన్వెజ్ తిన్నాక ఆఖర్లో ఈ చారుతో ముగించారంటే తిన్న ఆహారం ఈజీగా జీర్ణమవ్వడమే కాకుండా శరీరం కూడా తేలిక పడుతుందట.
అలాగే, వాము చారుని తినడం ద్వారా జలుబు, దగ్గు, వికారం వంటి సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు నిపుణులు. పైగా ఈ చారు తయారీ కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన పని లేదు. చాలా తక్కువ సమయంలో ఈ చారుని తయారు చేసుకోవచ్చు. మరి, ఈ హెల్దీ అండ్ టేస్టీ వాము చారుకి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
వాము పొడి కోసం :
- వాము - 1 టీస్పూన్
- ఎండుమిర్చి - 2
- ధనియాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
చారు కోసం :
- ఆయిల్ - 1 టీస్పూన్
- మెంతులు - అరటీస్పూన్
- ఆవాలు - అరటీస్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 4
- ఎండుమిర్చి - 1
- పచ్చిమిర్చి - 2
- చింతపండు - నిమ్మకాయ సైజంత
- పసుపు - పావు టీస్పూన్
- రాళ్ల ఉప్పు - రుచికి సరిపడా
- కరివేపాకు - 2 రెమ్మలు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వాము, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఆవాలు, మెంతులు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాక జీలకర్ర, క్రష్ చేసుకున్న వెల్లుల్లిరెబ్బలు, ఎండుమిర్చిని వేసుకొని మరికాసేపు ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత పచ్చిమిర్చి, నిమ్మకాయ సైజంత చింతపండు నుంచి తీసిన 250ఎంఎల్ చింతపండు రసం, పసుపు, రాళ్ల ఉప్పు, కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
- అనంతరం 250ఎంఎల్ వాటర్, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వాము పొడి వేసుకొని కలిపి మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి.
- ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఘుమఘుమలాడే "వాము చారు" రెడీ!
- దీన్ని వేడివేడిగా అన్నంలో పోసుకుని తినడమే కాకుండా నేరుగానూ తాగేయొచ్చు. అంత రుచికరంగా ఉంటుంది ఈ చారు. మరి, నచ్చితే మీరూ ఓసారి ఈ రెసిపీని ట్రై చేయండి.
ఇవీ చదవండి :
చలికాలంలో వేడి వేడి "మిరియాల చారు" - దగ్గు, జలుబుకు చక్కటి మందు
నెల్లూరు స్టైల్ "రసం" - ఈ పద్ధతిలో ప్రిపేర్ చేసుకోండి - డైరెక్టుగా రసమే తాగేస్తారు!