Adulteration Chilli Powder :ప్రస్తుత కాలంలో మనం ఉపయోగించే నిత్యావసర వస్తువులు దాదాపు అన్నీ కల్తీ అవుతున్నాయి. మార్కెట్లో కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. కొంతమంది అక్రమ మార్గాల్లో డబ్బులు ఎక్కువగా సంపాదించాలన్న ఉద్దేశంతో కల్తీ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. అయితే, ఇటీవల మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న కారాన్ని అక్రమార్కులు కల్తీ చేసి అమ్ముతున్నారు. నకిలీ కారం వంటల్లో ఉపయోగించడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఇంట్లోనే నకిలీ కారాన్ని గుర్తించడానికి 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI)' కొన్ని సూచనలు చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కల్తీ కారం ఇలా చేస్తున్నారు :అక్రమార్కులు మిర్చి తొడిమలు, తుక్కు కాయలు, తాలుకాయలు, వర్షానికి తడిసి రంగు మారి చీడపీడలతో దెబ్బతిన్న మిరపకాయలను వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి.. ఆ తర్వాత వీటన్నింటినీ పొడిగా చేస్తారు. అనంతరం ఆ పొడికి రంగులు జోడిస్తారు. చివరిగా ఆకర్షణీయమైన సంచుల్లో నింపి మార్కెట్‌లోకి తెస్తుంటారు.
కారంలో ఇటుకపొడి కలిపితే ఇలా గుర్తుపట్టవచ్చు :కొంతమంది కారంలో ఇటుకపొడి కలిపి నకిలీ కారం తయారు చేస్తున్నారు. దీనిని గుర్తించడానికి FSSAI ఒక చిట్కా సూచించింది. అదేంటంటే.. ఒక చిటికెడు కారం పొడిని అర చేతిలో వేసుకోవాలి. కారంపై కొన్ని నీటి చుక్కలు చల్లి.. చేతితో రుద్దాలి. కారంలో ఇటుకపొడి కలిపితే.. వేలికి, చేతికి గరుకుగా చిన్న రాళ్లు తగిలినట్లుగా అనిపిస్తుంది. ఇలా ఉంటే కారం కల్తీ అయినట్లు. అలాగే కారాన్ని చేతిలో వేసుకుని నీళ్లు పోసి రుద్దినప్పుడు కాస్త నురగ వస్తే అందులో సబ్బు కణాలు కలిసినట్లు గుర్తించాలంటున్నారు.