23 Year Old Person Looks Like 13year Old Boy :బ్రెజిల్‌లోని పాస్సో ఫుండో నగరానికి చెందిన లూయిజ్ అగస్టో మార్సియో మార్వెస్ అనే బాలుడు... ఏడేళ్ల వరకు అందరి పిల్లల్లాగే నార్మల్‌గానే ఉండేవాడు. ఆ తరువాత నుంచి ఏమైందో.. లూయిజ్‌కు అప్పుడప్పుడూ విపరీతమైన తలనొప్పి వస్తుండేది. అందువల్ల సరిగ్గా చదువలేకపోయేవాడు.. రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోయేవాడు. దీంతో ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్లు కూడా కారణం ఏంటో తేల్చలేకపోయారు. ఈ క్రమంలోనే కొందరు అతడికి వైరస్ సోకిందని.. మానసిక స్థితి సరిగా లేదని మరికొందరు చెప్పడం ప్రారంభించారు. అందుకే సోమరిగా మారి ఇలా ప్రవర్తిస్తున్నాడని ఇంకొంత మంది అనేవారు. ఇలా అనేక అవమానాలు అనుభవించిన బాలుడు.. చివరికి ఓ ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. అదేంటో తెలుసా?
పది లక్షల మందిలో ఒకరికి వస్తుందట..
లూయిజ్ ఇలా మారడానికి కారణం ఓ అరుదైన వ్యాధని తేల్చారు వైద్యులు. 'క్రానియోఫారింగియోమా' అనే అరుదైన వ్యాధి బారినపడి ఇలా చేసినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి దాదాపు పది లక్షల మందిలో ఒకరికి వస్తుందని... వెంటనే మెదడులోని కణతిని తొలగించకపోతే మరికొన్ని రోజుల్లో లూయిజ్ చనిపోతాడని కుటుంబసభ్యులకు చెప్పారు వైద్యులు. ఒక వేళ ఆపరేషన్ చేసినా కూడా బాలుడు మాట్లాడటం, నడవడం, కళ్లను తిప్పడం, పెరుగుదల ఆగిపోవడం వీటిలో ఏదైనా ఒకటి జరగొచ్చని మరో బాంబు లాంటి వార్తను చెప్పారు. వైద్యుల మాటలతో కంగుతిన్న కుటుంబసభ్యులు.. లూయిజ్ తమ కళ్ల ముందు ఉంటే అదే చాలని ఆపరేషన్‌కే ఓకే చెప్పారు.
ఆపరేషన్‌కు అంతా సెట్ అయ్యింది. వైద్యులు చెప్పినట్లుగానే ఆపరేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇప్పుడే అందరిలోనూ ఏం జరుగుతుందో అన్న టెన్షన్ మొదలైంది. లూయిజ్ పరిస్థితిని గమనించడానికి కొన్ని రోజులు పరిశీలనలో పెట్టగా.. తొందరగానే కోలుకున్నాడు. ఇలా కొద్ది రోజుల బాగానే ఉన్న తర్వాత ఓ సారి చేసిన వైద్య పరీక్షల్లో ఒక కంగుతినే విషయం బయటపడింది. ఆపరేషన్ చేయడం వల్ల పిట్యూటరీ అనే గ్రంథి దెబ్బతిన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఫలితంగా లూయిజ్ పెరుగుదల ఏ క్షణమైనా ఆగిపోవచ్చని వైద్యులు స్పష్టం చేశారు. అలా వైద్యులు చెప్పినట్లుగానే.. 12 ఏళ్లు నిండగానే లూయిజ్ ఎదుగుదల పూర్తిగా ఆగిపోయింది. ప్రస్తుతం లూయిజ్‌కు 23 ఏళ్లు వచ్చినా.. ఇప్పటికీ బాలుడిగానే ఉండిపోయాడు.