Father Death - Daughter Birth In Medak : అతనికి కుమార్తె పుట్టింది. ఆ పసి బిడ్డను చూసి మురిసిపోయాడు. ఎత్తుకొని ఆడించాడు. ఆ సంతోషాన్ని తన బంధువులతో పంచుకున్నాడు. కానీ నాన్న అని పిలిపించుకునే అదృష్టం అతనికి లేకుండా పోయింది. పాప పుట్టిన రెండు రోజులకే అతడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో కుటుంబంలోని అత్యంత ఆనందకరమైన క్షణాలు విషాదంలోకి మారాయి. భార్య ప్రసవించి ఆసుపత్రిలో ఉండగా, భర్త రోడ్డు ప్రమాదంలో మరణించి అదే ఆసుపత్రిలోని మార్చురీలోకి చేరాడు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.
భార్య ప్రసవించి ఆసుపత్రిలో ఉండగా భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెంది అదే ఆసుపత్రిలో మార్చురీలో ఉన్న హృదయ విదారక ఘటన తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామానికి చెందిన విజయ్, మౌనిక దంపతులకు రెండు రోజుల క్రితం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కుమార్తె ప్రసవించింది. విజయ్.. ఆసుపత్రిలో ఉన్న తన పాపను చూసి సంతోషంతో పాపతో గడిపాడు. తర్వాత ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వస్తుండగా మనోహరాబాద్ వద్ద విభాగిని వద్ద మలుపు తీసుకుంటున్న డీసీఎం, స్కూటీని ఢీకొనడంతో విజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
అతని వెంట ఉన్న స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. చనిపోయిన విజయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక వైపు భార్య మౌనిక ప్రసవించి ఆసుపత్రిలో ఉండగా, భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెంది అదే ఆసుపత్రిలోని మార్చురీలో ఉండడం చూసి ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదంటూ బంధువులు, గ్రామస్థులు బోరున విలపించారు.
తండ్రి మరణం, కుమారుడి జననం : సుమారు 20 రోజుల క్రితం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కుమారుడు జన్మించిన గంటసేపటికే రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించాడు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మలపల్లికి చెందిన శివ అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం రాజోలి నుంచి సొంత గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మార్గమధ్యలో ఒక్కసారిగా కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి అతని వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన శివను హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి కథనం కోసం తండ్రి మరణం, కుమారుడి జననం - గద్వాల జిల్లాలో హృదయాన్ని మెలిపెట్టే విషాదం పై క్లిక్ చేయండి.
భవనం పైనుంచి జారిపడిన దంపతులు - భర్త మృతి, భార్య పరిస్థితి విషమం