Homemade Hair Packs for Hair Growth : రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం, మారుతున్న జీవన విధానం కురుల మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఫలితంగా జుట్టు ఊడిపోవడం, పలుచగా అయిపోవడం.. ఇలా రకరకాల జుట్టు సమస్యలెన్నో తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఆ సమస్యల నుంచి బయటపడేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాకాకుండా ఓసారి ఇంట్లోనే సహజసిద్ధంగా ఈ ప్యాక్స్ తయారు చేసుకొని ప్రయత్నించి చూడండి. ఈ నేచురల్ ప్యాక్స్‌లో వాడే పదార్థాలలోని పోషకాలు జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేసి వెంట్రుకలకు బలాన్ని, మెరుపునూ ఇస్తాయంటున్నారు నిపుణులు. అలాగే వివిధ జుట్టు సమస్యలు తొలగిపోతాయంటున్నారు. ఇంతకీ, ఆ హెయిర్ ప్యాక్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పెరుగుతో సూపర్ ప్యాక్ : పెరుగు పొట్టకే కాదు.. జుట్టు ఆరోగ్యానికి చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక బౌల్లో అరకప్పు చొప్పున పెరుగు, తేనె, ఒక చెంచా బాదం నూనె తీసుకొని అన్నింటినీ బాగా కలపాలి. ఆపై ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత తక్కువ గాఢత ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుందంటున్నారు.
స్ట్రాబెర్రీలతో :ఈ నేచురల్ హెయిర్ ప్యాక్ కూడా జుట్టును మృదువుగా, బలంగా తయారు చేయడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. దీనికోసం ఒక బౌల్లో జుట్టుపొడవుని బట్టి సరిపడినన్ని స్ట్రాబెర్రీలు, ఒక చెంచా చొప్పున కొబ్బరినూనె, తేనె తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని జుట్టుకి అప్త్లె చేసి కాసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్న నీళ్లతో తలస్నానం చేస్తే సరి. నిగనిగలాడే కురులే కాదు.. చక్కటి సువాసన కూడా వస్తుందంటున్నారు.
మందారతో : ఈ హెయిర్ ప్యాక్ కూడా జుట్టును స్ట్రాంగ్‌గా తయారవ్వవడానికి చాలా తోడ్పడుతుంది. ఇందుకోసం కప్పుకి సరిపడా మందార పూల రేకుల్ని తీసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని మెత్తగా చేసి దానికి ఆలివ్‌నూనెని జత చేసి మాడుకి అప్లై చేయాలి. గంటసేపు అలా ఉంచి ఆపై శుభ్రంగా నీటితో కడిగేయాలి. ఇలా చేయడం కేశాలు మెత్తబడటమే కాక మెరుపును కూడా సంతరించుకుంటాయంటున్నారు నిపుణులు.