Oil Skin Remove Tips in Telugu: కాలంతో సంబంధం లేకుండా కొంతమంది చర్మం ఎప్పుడూ జిడ్డుగానే కనిపిస్తుంటుంది. ముఖ్యంగా చలికాలంలో అయితే, ఇంకాస్త ఎక్కువగా ఈ సమస్య వేధిస్తుంటుంది. ఇలాంటి వారు మాయిశ్చరైజర్ రాసుకోవాలన్నా కూడా ఇబ్బంది పడుతుంటారు. కానీ, కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ఈ సమస్యకు పరిష్కారం చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు: ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జిడ్డుదనాన్ని దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రతిరోజూ రాత్రిపూట చెంచా పసుపులో కొన్ని పాలు పోసి మెత్తటి ముద్దలా చేసుకోని ముఖం, మెడకు రాసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా పెట్టుకుని పావుగంటయ్యాక కడిగేస్తే ముఖంపై పేరుకున్న జిడ్డు తొలగిపోతుందని వివరిస్తున్నారు. 2018లో Journal of Cosmetic Dermatologyలో ప్రచురితమైన "Turmeric extract and its active compound curcumin reduce sebum production in human sebocytes" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
వంటసోడా: జిడ్డు సమస్యకు వంటసోడా కూడా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం చెంచా నిమ్మరసంలో అరచెంచా బేకింగ్ సోడా కలిపి మొటిమలు ఉన్న చోట పూతలా వేయాలని చెబుతున్నారు. ఆ తర్వాత తడి చేత్తో మర్దన చేసి ఆ పూతను తొలగిస్తే మృతకణాలు పోతాయని వివరిస్తున్నారు. ఇంకా మొటిమలు కూడా తగ్గుముఖం పట్టడమే కాకుండా.. అలాగే జిడ్డు సమస్య కూడా తగ్గుతుందని వెల్లడిస్తున్నారు.
ఉప్పు:ఇందుకోసం స్ప్రే సీసాలో నీళ్లు తీసుకుని అందులో చెంచా ఉప్పు వేసి.. ముఖం మీద ఆ నీటిని తరచూ స్ప్రే చేసుకుంటూ తుడుచుకోవాలని చెబుతున్నారు. ఇలా చేస్తే జిడ్డు సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుందని వివరిస్తున్నారు. అయితే, కళ్లపై మాత్రం ఆ స్ప్రే పడకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు.
నిమ్మరసం: జిడ్డు చర్మతత్వం ఉన్న వారికి నిమ్మరసం చక్కగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసంలో కొన్ని నీళ్లు కలిపి అందులో దూదిని ఉండలుగా చేసి వేయాలని వివరిస్తున్నారు. కాసేపు ఆ ఉండల్ని ఫ్రిజ్‌లో ఉంచి ఆ తర్వాత బయటికి తీసి వాటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల చర్మంపై మురికి తొలగిపోయి శుభ్రపడుతుందని తెలిపారు. ఇంకా చర్మానికి తేమ అందడమే కాకుండా.. జిడ్డు కూడా అదుపులోకి వస్తుందని పేర్కొన్నారు.