Henna Hair Pack Bnefits:మనలో చాలా మందికి చుండ్రు సమస్య వేధిస్తుంటుంది. ప్రత్యేకించి శీతాకాలంలో అయితే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో దొరికే వివిధ రకాల షాంపూలు వాడుతుంటారు. కానీ, ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలకు హెన్నా పొడి కలిపి తయారు చేసుకునే హెయిర్ ప్యాక్స్‌తో కూడా ఈ చుండ్రు సమస్యను ఈజీగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్డు ప్యాక్:కోడి గుడ్డులోని తెల్లసొన జుట్టుకు పోషణను అందించడంలో ఎంతగానో సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. ఇది చుండ్రును తొలగించడానికీ ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు. ఇందుకోసం మూడు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడి, టేబుల్‌స్పూన్ ఆలివ్ నూనె, రెండు టేబుల్‌స్పూన్ల బాగా బీట్ చేసిన గుడ్డు తెల్లసొనను.. ఒక బౌల్‌లో తీసుకొని కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ మృదువైన పేస్ట్‌లా తయారుచేసుకోవాలట. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి 45 నిమిషాల పాటు ఉంచుకోవాలని తెలిపారు. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలని సూచిస్తున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొన్ని రోజుల్లోనే చుండ్రు సమస్య నుంచి విముక్తి కలుగుతుందని వెల్లడిస్తున్నారు.
మిరియాలు:జుట్టు కుదుళ్లలోని ఫంగల్ ఇన్ఫెక్షన్లను తొలగించడంలో మిరియాలు చక్కటి పరిష్కారం చూపుతాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా.. ముఖ్యంగా చుండ్రును తగ్గించడంలోనూ ఇది బాగా పనిచేస్తుందని వివరిస్తున్నారు. ఇందుకోసం నాలుగు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడిలో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర పేస్ట్, తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలని చెబుతున్నారు. అనంతరం ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి పూర్తిగా ఆరనివ్వాలని తెలిపారు. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే త్వరలోనే చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందచ్చని అంటున్నారు.
ఈ నూనెతో:చుండ్రు సమస్యను తగ్గించడానికి ఆవనూనె కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా పావు లీటర్ ఆవనూనెను ఒక గిన్నెలో తీసుకొని వేడి చేయాలని తెలిపారు. దాన్నుంచి పొగ వెలువడుతున్న సమయంలో స్టౌ కట్టేసి అందులో గుప్పెడు గోరింటాకు, టీస్పూన్ మెంతుల్ని వేయాలని సూచిస్తున్నారు. ఇప్పుడు ఈ నూనెను పూర్తిగా చల్లారనిచ్చి వడకట్టుకొని గాలి చొరబడని సీసాలో స్టోర్ చేసుకోవాలని వివరిస్తున్నారు. ఇలా రెడీ చేసుకున్న నూనెను తలస్నానానికి ముందు కుదుళ్లు, జుట్టుకు పట్టించాలని తెలిపారు. సుమారు గంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు సమస్య నుంచి త్వరలోనే ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.