Hair Fall Control Tips: ఈ మధ్య కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల చిన్న వయసులోనే చాలా మందికి జుట్టు ఊడిపోతుంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నా.. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే జుట్టు ఊడిపోకుండా కొంతవరకు కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జుట్టు ఆరోగ్యానికి పాటించాల్సిన కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరానికి ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంత అవసరమో.. శిరోజాల సంరక్షణకు కూడా హెల్దీ లైఫ్ స్టైల్ తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. ఇందులో భాగంగా మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల శరీరంలో నీటి స్థాయులు పెరగడమే కాకుండా చర్మంలోని మలినాలు, వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయని వివరిస్తున్నారు. ఫలితంగా జుట్టు కూడా ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. 2015లో Journal of Cosmetic Dermatology ప్రచురితమైన The effects of hydration on hair growth అనే అధ్యయనంలోనూ తేలింది. ఇంకా అవసరమైతే వైద్యులను సంప్రదించి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇందులోని పోషకాలు జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తాయని తెలిపారు.
తలస్నానానికి బాగా వేడిగా ఉండే నీళ్లు ఉపయోగించడం వల్ల జుట్టు కుదుళ్లకు నష్టం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి గోరువెచ్చని నీటినే తలస్నానానికి ఉపయోగించాలని సూచిస్తున్నారు. వెంట్రుకలు దృఢత్వాన్ని సంతరించుకోవాలంటే స్నానం తర్వాత కండిషనర్‌ను తప్పనిసరి రాసుకోవాలని సలహా ఇస్తున్నారు.
స్నానం చేసిన తర్వాత సాధ్యమైనంతవరకు జుట్టును సహజంగానే ఆరనివ్వాలని నిపుణలు అంటున్నారు. వేడి కలిగించే హెయిర్ డ్రయర్స్‌ను అధికంగా వాడడం వల్ల కుదుళ్లలో దురద, అలర్జీలు, జుట్టు చివర్లు చిట్లడం వంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం అతి వేడి జుట్టును బలహీనంగా మారుస్తుందని తెలిపారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అలాగే తలస్నానం చేశాక జుట్టును తుడుచుకునేందుకు రెగ్యులర్ టవల్స్ బదులు మైక్రోఫైబర్ ర్యాపర్స్‌ను వినియోగిస్తే మేలని చెబుతున్నారు.
ముఖ్యంగా తలస్నానం చేసిన వెంటనే జుట్టును దువ్వకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేస్తే వెంట్రుకలు తెగిపోవడం, ఎక్కువ జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. జుట్టు దువ్వుకోవడానికి కూడా మెత్తటి బ్రిజిల్స్ ఉండే దువ్వెనను ఉపయోగించడం ఉత్తమమని సూచిస్తున్నారు.