Russia Lost Full Battalion :రష్యా భూభాగమైన కస్క్ రీజియన్లో మాస్కో కీవ్ సైన్యాల మధ్య పోరు తీవ్రమైంది. ఇన్నిరోజులు వేలమంది సైనికులను పోగొట్టుకున్న జెలెన్స్కీ బలగాలు, తాజాగా పుతిన్ సైన్యాన్ని భారీ దెబ్బకొట్టినట్లు తెలిసింది. గడిచిన రెండు రోజుల్లో ఆ ప్రాంతాల్లో మోహరించిన రష్యన్ పదాతిదళం బెటాలియన్ మొత్తాన్ని అంతమొందించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ తెలిపారు. రష్యన్ సైన్యానికి మద్దతుగా పోరాడుతున్న ఉత్తరకొరియా సైనికులు కూడా భారీగా చనిపోయినట్లు ప్రకటించారు. పొక్రోస్క్ ప్రాంతంలో ప్రస్తుతం యుద్ధం తీవ్రంగా సాగుతోందని వెల్లడించారు. ఖార్కీవ్, సుమీ రీజియన్లలోని గ్రామాలపై గైడెడ్ ఏరియల్ బాంబులను రష్యా ప్రయోగిస్తోందని ఆరోపించారు.
540 మంది ఉక్రెయిన్ సైనికులు హతం!
మరోవైపు కస్క్ రీజియన్లో గత 24 గంటల్లో 540 మంది కీవ్ సైనికులను హతమార్చాయని రష్యా రక్షణశాఖ ప్రకటించింది. ఉక్రెయిన్ ప్రయోగించిన 8 అమెరికన్ క్షిపణులు, 72 డ్రోన్లను తమ గగనతల వ్యవస్థ కూల్చేసినట్లు పేర్కొంది. ఉక్రెయిన్ సైనిక ఎయిర్పోర్టులు, డ్రోన్ అసెంబ్లింగ్ కేంద్రాలు, ఆయుధ గిడ్డంగులను దెబ్బతీసినట్లు మాస్కో వివరించింది.