China Taiwan War : స్వతంత్ర ద్వీపదేశమైన తైవాన్‌పై చైనా దాడులకు సిద్ధమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. యుద్ధానికి సిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇటీవల తమ దేశ సైనికులకు పిలుపునిచ్చారు. చైనా వ్యతిరేకిగా పేరొందిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన పదవి చేపట్టడానికి ఇంకా 75 రోజులు సమయం ఉంది. ఈలోగా తైవాన్‌పై చైనా దాడులు చేసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇదే సరైన సమయమని - ఒకవైపు ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు సాయంగా ఉత్తర కొరియా సైన్యం బరిలోకి దిగింది. మరోవైపు పశ్చిమాసియాలో హెజ్బొల్లా, హమాస్, ఇరాన్‌లతో ఇజ్రాయెల్ భీకర యుద్ధం కొనసాగిస్తోంది. ఇంకోవైపు అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత అధికార మార్పిడి ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ దృష్టి వీటిపై నెలకొనడం వల్ల ఇదే అదునుగా చేసుకొని స్వతంత్ర ద్వీపదేశమైన తైవాన్‌పై చైనా దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి తమపై లేకపోవడం వల్ల తైవాన్‌పై దాడులకు ఇదే సరైన సమయమని చైనా భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు యుద్ధానికి, సంసిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇటీవల తమ దేశ సైనికులకు పిలుపునిచ్చారు. ఇటీవల పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్‌కు చెందిన బ్రిగేడ్‌ను సందర్శించిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ యుద్ధానికి సన్నాహాలను సమగ్రంగా బలోపేతం చేయాలని సైన్యానికి పిలుపునిచ్చినట్లు ఆ వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. తమ దళాలు పటిష్ఠమైన పోరాట సామర్థ్యాలను కలిగి ఉండేలా చూడాలని సైనికులు తమ వ్యూహాత్మక పోరాట సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని జిన్‌పింగ్ సూచించారు.
యుద్ధం సన్నద్ధతపై ఆందోళన - భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ- LAC వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇటీవల ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. అందుకు అనుగుణంగానే సరిహద్దుల్లో తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లోని రెండు కీలక ప్రాంతాలైన డెమ్చోక్, డెస్పాంగ్ నుంచి రెండు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న మరిన్ని వివాదాలకు భవిష్యత్తులో పరిష్కారం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చైనా తన సరిహద్దు దేశాలను బెదిరించడం లేదు కానీ తమ సైనికులను యుద్ధానికి సిద్ధం చేస్తుండటంపై ఆందోళన నెలకొంది.
ఆ చర్యలకు హెచ్చరికగా -ఇటీవల తైవాన్ చూట్టూ చైనా పెద్దఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించిన కొద్దిరోజులు తర్వాత ఈ ప్రకటన రావడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. తైవాన్ను తన భూభాగంగా చెబుతున్న చైనా మిగతా దేశాల దృష్టి తమపై లేనప్పుడే దాడి చేయాలని చూస్తోంది.