తెలంగాణ

telangana

ETV Bharat / international

ఎయిర్​పోర్ట్​లో బాంబు దాడి- WHO చీఫ్ జస్ట్​ మిస్​! - ISRAEL STRIKE TEDROS ADHANOM

యెమెన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు దాడి- త్రుటిలో తప్పించుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్‌ అధానోమ్‌

Israel Strike Tedros Adhanom
Israel Strike Tedros Adhanom (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2024, 8:45 AM IST

Updated : Dec 27, 2024, 8:53 AM IST

Israel Strike Tedros Adhanom :ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానోమ్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. యెమెన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కేందుకు వేచి ఉండగా వైమానిక బాంబు దాడి జరిగింది. సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని ఐక్యరాజ్యసమితి ఖండించింది.

"ఐక్యరాజ్యసమితికి చెందిన ఉద్యోగులతో కలిసి ఖైదీల విడుదలపై చర్చలు, యెమెన్‌లో ఆరోగ్యం, మానవతా పరిస్థితులను అంచనా వేసేందుకు అక్కడికి వెళ్లాం. ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని మేము పిలుపునిచ్చాం. సనాలో విమానం ఎక్కేందుకు వేచిఉండగా బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. విమానంలోని ఓ సిబ్బంది గాయాలపాలయ్యారు. ఘటన జరిగిన ప్రాంతానికి, మాకు కొన్ని మీటర్ల దూరం మాత్రమే ఉంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియచేస్తున్నాం" అని అధానోమ్‌ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

వైమానిక దాడులు ఆందోళనకరం
ఈ దాడిని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఎక్స్ వేదికగా ఖండించారు. "ఇటీవల యెమెన్‌, ఇజ్రాయెల్‌ల మధ్య దాడులు తీవ్రతరం అయ్యాయి. సనా అంతర్జాతీయ విమనాశ్రయంతో సహా ఎర్రసముద్రం, ఓడరేవులు, యెమెన్‌లో పవర్ స్టేషన్‌లపై వైమానిక దాడులు ఆందోళనకరంగా ఉన్నాయి" అని పేర్కొన్నారు. ఈసందర్భంగా అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలన్నారు. పౌరులు, మానవతా కార్మికులే లక్ష్యంగా దాడులు చేయకూడదన్నారు.

యెమెన్‌లోని సనా విమానాశ్రయం, ఇతర నౌకాశ్రయాలపై, పలు విద్యుత్కేంద్రాలపై గురువారం ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. హమాస్, హెజ్‌బొల్లా, సిరియాలోని అసద్‌ ప్రభుత్వాలు ఏం నేర్చుకున్నారో, త్వరలో హూతీలు అదే నేర్చుకుంటారని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే ఈ దాడులు జరగడం గమనార్హం. గత కొన్ని రోజులుగా హూతీలు.. ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో కొంతమంది ఇజ్రాయెలీ పౌరులకు కూడా గాయాలయ్యాయి. ఈనేపథ్యంలో హూతీలను టెల్‌అవీవ్‌ లక్ష్యంగా చేసుకుంది. తాజా దాడులను ఇతర సైనికాధికారులతో కలిసి నెతన్యాహు పర్యవేక్షించినట్లు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం తెలిపింది.

Last Updated : Dec 27, 2024, 8:53 AM IST

ABOUT THE AUTHOR

...view details