What happens on Donald Trump Inauguration : రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు కాబోతున్నారు. ఆయన ఇంకొన్ని గంటల్లో అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 10.30 గంటలకు వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంలో ప్రమాణ స్వీకారోత్సవ ఘట్టం మొదలవుతుంది. ప్రస్తుతం వాషింగ్టన్‌లో తీవ్రమైన చలి ఉంది. దీంతో ఈసారి ఈ కార్యక్రమాన్ని క్యాపిటల్ భవనం లోపల ఉండే రోటుండా సముదాయంలో జరుపుతున్నారు.
'అమెరికా అధ్యక్షుడి నాలుగేళ్ల పదవీ కాలం జనవరి 20న మధ్యాహ్నం ముగుస్తుంది' అని వాళ్ల రాజ్యాంగంలోని 20వ సవరణ చెబుతోంది. ఈ లెెక్కన అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నమే ట్రంప్ ప్రమాణం చేస్తారు. ఆయనతో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ సందర్భంగా రోటుండా సముదాయం లోపలే మిలిటరీ రెజిమెంట్లు, స్కూల్ బ్యాండ్స్ పరిమిత స్థాయిలో తమ ప్రదర్శన ఇస్తాయి. అమెరికన్ మ్యూజిక్ ఐకాన్ కేరీ అండర్ వుడ్ సంగీత కచేరీ చేయనున్నారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తారు.
ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలను అమెరికా కాంగ్రెస్ సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. వీటికి సెనెటర్ అమీ క్లోబుచర్ సారథ్యం వహిస్తున్నారు. ఆయన మిన్నెసోటా నుంచి డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా సెనేట్‌కు ఎన్నికయ్యారు. 2017లో ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సగటున గంటలోనే పూర్తయింది. ఇప్పటివరకు అధ్యక్షుడిగా వ్యవహరించిన జో బైడెన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ట్రంప్ ఆహ్వానం అందుకున్న వివిధ దేశాల ప్రభుత్వాధినేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
భద్రతా కారణాలతో తాను రాలేకపోతున్నట్లు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇప్పటికే ట్రంప్‌కు తెలియజేశారు. టెక్ మొగల్స్ ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్ హాజరవుతారు. ఈసారి ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవ ఖర్చుల కోసం దాదాపు రూ.1,400 కోట్ల విరాళాలను సేకరించారు. దీనికి బెజోస్, జుకర్ బర్గ్, ఉబెర్ సీఈఓ ఖోస్రోషాహీ చెరో రూ.8.65 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి భారీగా విరాళాలు అందించిన పెద్దస్థాయి దాతలకు ప్రత్యేక ప్రైవేటు విందును ఏర్పాటు చేశారు. అమెరికా ఆయిల్ మ్యాగ్నేట్‌గా పేరొందిన హరోల్డ్ హామ్ ప్రఖ్యాత హే ఆడమ్స్ హోటల్‌లో ప్రముఖ దాతలందరికీ విందు కార్యక్రమాన్ని ఇవ్వనున్నారు.
ప్రమాణ స్వీకారోత్సవం షెడ్యూల్ ఇదే!.
- వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనం వరకు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ
- న్యూయార్క్ ఆర్చ్ బిషప్ టిమోథీ కార్డినల్ డోలన్, క్రైస్తవ మత ప్రచారకుడు ఫ్రాంక్లిన్ గ్రాహం ప్రసంగిస్తారు.
- క్రిస్టోఫర్ మాచియో అనే గాయకుడు "Oh, America!" గీతాన్ని ఆలపిస్తారు.
- తొలుత అమెరికా ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ప్రమాణం చేస్తారు. ఆయనతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రెట్ కవానా ప్రమాణం చేయిస్తారు.
- తదుపరిగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేస్తారు.
- అనంతరం అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తారు.
- ఇప్పటివరకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో సేవలు అందించిన జో బైడెన్, కమలా హారిస్‌కు గౌరవ వీడ్కోలు పలుకుతారు.
- సంతకాలు చేసే కార్యక్రమంలో భాగంగా మెమొరాండమ్లు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై కొత్త అధ్యక్షుడు ట్రంప్ సంతకాలు చేస్తారు.
- క్యాపిటల్ భవనంలో నూతన అధ్యక్షుడితో కలిసి ప్రముఖులంతా లంచ్ చేస్తారు.
- తదుపరిగా నూతన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కలిసి సైనిక బలగాల ప్రదర్శనలు, ప్రెసిడెన్షియల్ పరేడ్‌లను తిలకిస్తారు.
- ఈసారి అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవ నినాదం ఏమిటంటే- 'మా సుస్థిర ప్రజాస్వామ్యం.. ఒక రాజ్యాంగ వాగ్దానం' (Our Enduring Democracy: A Constitutional Promise).