Vivek Ramaswamy Steps Down From DOGE :తాజాగా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గం నుంచి వ్యాపారవేత్త, రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి వైదొలిగారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో కీలకమైన డోజ్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) బాధ్యతల నుంచి భారత అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి వైదొలిగారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ట్రంప్ కార్యవర్గం నుంచి వివేక్ రామస్వామి ఔట్! కొత్త అధ్యక్షుడు కొలువుదీరిన గంటల్లోపే! - VIVEK RAMASWAMY VIVEK RAMASWAMY
డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ- డోజ్ నుంచి వైదొలిగిన భారత అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి- కారణం ఏంటంటే?
Published : Jan 21, 2025, 8:11 AM IST
ఇదిలా ఉండగా, డోజ్ విభాగం ఏర్పాటు కావడంలో తనవంతు సహాయం చేయడం గర్వంగా ఉందని వివేక్ రామస్వామి చెప్పారు. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని బృందం ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడడంలో విజయం సాధిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒహాయోలో తన భవిష్యత్తు ప్రణాళికల గురించి త్వరలో చెప్పాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాను గొప్పగా మర్చే ప్రయత్నంలో ఆయనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే అగ్రరాజ్యానికి నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేసిన గంటల్లోనే రామస్వామి ఈ ప్రకటన చేయడం గమనార్హం.
"డోజ్ ఏర్పాటులో వివేక్ రామస్వామి కీలక పాత్ర పోషించారు. ఆయన త్వరలో ఎలెక్టెడ్ ఆఫీస్‌కు పోటీ చేయాలనుకుంటున్నారు. అదే జరిగితే ఆయన డోజ్ కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది" అని ట్రంప్ బృందం ప్రతినిధి అన్నా కెల్లీ తెలిపారు.