అమెరికా అధ్యక్షుడికి ఎంత జీతం ఇస్తారు? ఎలాంటి సౌకర్యాలు, భద్రత కల్పిస్తారో మీకు తెలుసా?
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌నకు ఇచ్చే జీతభత్యాలు, సౌకర్యాల వివరాలు మీ కోసం!
White House (Getty Images)
Published : Nov 6, 2024, 8:54 PM IST
US President Salary And Perks :అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడికి జీతభత్యాలు ఎలా ఉంటాయి? ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయి? అనే వివరాలు గురించి చాలా మంది ఆసక్తిగా చూస్తుంటారు. అందుకే ఈ ఆర్టికల్‌లో అమెరికన్ ప్రెసిడెంట్‌కు ఇచ్చే జీతభత్యాలు గురించి, భద్రతా ఏర్పాట్లు గురించి తెలుసుకుందాం.
- అమెరికా అధ్యక్షుడికి ఒక సంవత్సరానికి 4 లక్షల డాలర్ల వరకు వేతనంఅందిస్తారు. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ.3.3 కోట్లు వరకు ఉంటుంది. ఈ మొత్తాన్ని అమెరికా కాంగ్రెస్ 2001లో నిర్ణయించింది. అప్పటి నుంచి ఈ మొత్తంలో ఎలాంటి మార్పూ లేదు. సింగపూర్ ప్రధాని అందుకునే 16 లక్షల డాలర్లలో ఇది నాలుగో వంతు మాత్రమే కావడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడిగా రిటైరయ్యాక కూడా వార్షికంగా 2 లక్షల డాలర్లు అందిస్తుంటారు. అంతేకాదు 1 లక్ష డాలర్లు అలవెన్సు రూపంలో ఇస్తారు.
- అమెరికా అధ్యక్షుడికి వేతనంతోపాటు వ్యక్తిగత, అధికారిక ఖర్చుల కోసం ఏటా 50 వేల డాలర్లు అందిస్తారు. వీటిపై ఎలాంటి పన్ను ఉంటుంది. ప్రయాణ ఖర్చుల కోసం మరో లక్ష డాలర్లు, వినోదం కోసం మరో 19 వేల డాలర్లు ఇస్తారు. ఈ మొత్తాలన్నీ కలిపితే ఏటా అధ్యక్షుడికి 5.69 లక్షల డాలర్ల వరకు అందుతుంది. అధ్యక్షుడిగా శ్వేతసౌధంలోకి అడుగుపెట్టడానికి ముందు డెకరేట్ చేయడానికి మరో లక్ష డాలర్లు కూడా చెల్లిస్తారు.
- అమెరికా అధ్యక్షుడు అనగానే గుర్తొచ్చేది 'వైట్‌హౌస్'. ఇది అధ్యక్షుని అధికారిక నివాసం. అందుకే అమెరికా అధ్యక్షుడిని శ్వేతసౌధానికి అధిపతి అని కూడా అంటారు. ఆరు అంతస్తుల ఈ భవనాన్ని 1800లో నిర్మించారు. తరువాత కాలక్రమేణా హంగులు జోడించుకుంటూ వస్తున్నారు. 55,000 చదరపు అడుగుల కలిగిన ఈ భవంతిలో 132 గదులు, 35 బాత్‌రూమ్‌లు ఉన్నాయి. ఇందులోనే టెన్నిస్ కోర్ట్, జాగింగ్ ట్రాక్, మూవీ థియేటర్, స్విమ్మింగ్ పూల్ లాంటివి ఉంటాయి. అధ్యక్షుడికి విందు కోసం నిత్యం ఐదుగురు చెఫ్‌లు పనిచేస్తుంటారు.
- శ్వేత సౌధం కాకుండా 'బ్లెయిర్ హౌస్' అనే అతిథి గృహం కూడా అధ్యక్షుడికి ఇస్తారు. ఇది శ్వేతసౌధం కంటే పెద్దగా 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో 119 గదులు, అతిథుల కోసం 20 బెడ్‌రూములు, 35 బాత్‌రూమ్‌లు, 4 డైనింగ్ హాల్స్, జిమ్, సెలూన్ లాంటివి ఉంటాయి.
- ఇవి కాకుండా'క్యాంప్ డేవిడ్'అనే పర్వత విడిది కేంద్రం కూడా ప్రెసిడెంట్‌కు ఇస్తారు. మేరీల్యాండ్ రాష్ట్రంలో 128 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉంటుంది. ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్డ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి అధ్యక్షుడు దీన్ని వినియోగిస్తున్నారు. దౌత్యపరమైన చర్చల కోసం ఎక్కువగా దీనిని వినియోగిస్తుంటారు. ఇజ్రాయెల్, ఈజిప్టుల మధ్య ఒప్పందం ఇక్కడే జరిగింది. అందుకే ఆ ఒప్పందాన్ని క్యాంప్ డేవిడ్ ఒప్పందంగా పరిగణిస్తారు.
- అమెరికా అధ్యక్షుడు ప్రయాణించడానికి 'ఎయిర్‌ఫోర్స్ వన్' అనే ప్రత్యేక విమానం ఉంటుంది. ఇందులో సకల సౌకర్యాలూ ఉంటాయి. గాల్లో ఉండగానే ఇంధనాన్ని నింపుకొనే సామర్థ్యం దీని సొంతం. ఓ విధంగా దీనిని ఎగిరే శ్వేతసౌధంగా పిలుస్తారు.
- అధ్యక్షుడికి సేవలందించడానికి'మెరైన్ వన్' అనే హెలికాప్టర్ కూడా ఉంటుంది. ఇది గంటకు 241 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. భారీ పేలుళ్లను తట్టుకొనేలా దీనికి బాలిస్టిక్ ఆర్మర్ ఉంటుంది. క్షిపణి హెచ్చరిక వ్యవస్థతో పాటు, క్షిపణి రక్షణ వ్యవస్థ ఉంది. మూడు ఇంజిన్లలో ఒకటి విఫలమైనా ఎగరగలదు. ఒకేలాంటివి ఐదు హెలికాప్టర్లు ఉంటాయి. ఎందులో అధ్యక్షుడు ఉన్నాడో శత్రువులకు తెలియకుండా చేయడం కోసం వీటిని వాడతారు.
- ప్రపంచంలోనే అత్యంత భద్రమైన కారును అమెరికా అధ్యక్షుడి ప్రయాణానికి వినియోగిస్తారు. దీన్ని 'బీస్ట్'గా వ్యవహరిస్తారు. అధునాతన ఫీచర్లతో, భారీ భద్రతా ప్రమాణాలతో ఈ కారును తయారుచేశారు. అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా బీస్ట్ అక్కడ అడుగుపెట్టాల్సిందే. అమెరికా అధ్యక్షుడితో పాటు వారి కుటుంబ సభ్యులకు 24/7 సీక్రెట్ సర్వీస్ భద్రత ఉంటుంది.