US On China About Arunachal Pradesh :భారత భూభాగమైన అరుణాచల్‌ప్రదేశ్‌ను తమదే అంటున్న చైనా వైఖరిని అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ భారత్‌దేనని తేల్చి చెప్పింది. ఆ విషయాన్ని ఏకపక్షంగా మార్చడానికి చైనా చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ బుధవారం వెల్లడించారు.
అరుణాచల్‌ప్రదేశ్‌పై గతకొన్నేళ్లుగా చైనా మొండి వాదనలు వినిపిస్తోంది. ఆ ప్రాంతం తమ భూభాగంలోనిదేనని ఇటీవల ఆ దేశ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్ కర్నల్ ఝాంగ్ షియాంగాంగ్ అసంబద్ధ వాదనలకు దిగారు. దీన్ని భారత్ దీటుగా తిప్పికొట్టింది. చైనా చేసిన ప్రకటన అసంబద్ధమైనదని, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో భాగమేనని మరోసారి స్పష్టం చేసింది. అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో అక్కడి పౌరులు ప్రయోజనం పొందుతూనే ఉంటారని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌కు 'జాంగ్‌నన్ (దక్షిణ టిబెట్)'గా చైనా పెట్టుకున్న పేరు . ఇటీవల భారత ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో సేలా సొరంగ మార్గాన్ని ప్రారంభించడంపై చైనా అభ్యంతరం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనని, చట్టవ్యతిరేకంగా భారత్ ఏర్పాటు చేసిన రాష్ట్రాన్ని తాము ఎప్పటికీ గుర్తించబోమని డ్రాగన్ మరోసారి విషం కక్కింది.