America Attack On Syria : లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వరుస దాడులు తదితర పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా యుద్ధ విస్తరణ భయాల నడుమ అటు సిరియాలో అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. వారంతా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్‌ఖైదా అనుబంధ సంస్థలకు చెందినవారేనని తెలిపింది. మృతుల్లో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు వెల్లడించింది.
సిరియాపై విరుచుకుపడ్డ అమెరికా- 37 మంది ఉగ్రవాదులు హతం - America Attack On Syria - AMERICA ATTACK ON SYRIA
America Attack On Syria : సిరియాపై అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అగ్రరాజ్యం ప్రకటించింది.

Published : Sep 29, 2024, 6:38 PM IST
అల్‌ఖైదా అనుబంధ హుర్రాస్ అల్-దీన్ గ్రూప్‌నకు చెందిన ఓ సీనియర్ ఉగ్రవాదితోపాటు మరో ఎనిమిది మందిని లక్ష్యంగా చేసుకుని వాయువ్య సిరియాపై దాడి చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఆ సీనియర్ ఉగ్రవాది స్థానికంగా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది. అంతకుముందు మధ్య సిరియాలోని ఐసిస్ శిక్షణ స్థావరంపై పెద్దఎత్తున వైమానిక దాడి నిర్వహించి 28 మంది ఉగ్రవాదులను అంతమొందించినట్లు చెప్పింది.
తాజా దాడులతో ఐసిస్ శక్తిసామర్థ్యాలు దెబ్బతిన్నట్లు అమెరికా ప్రకటించింది. తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించే, మిత్రదేశాలు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించేవారిని సహించబోమని తెలిపింది. ఇదిలా ఉండగా గతంలో స్థానికంగా పెద్దఎత్తున భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకున్న ఐసిస్ గ్రూప్ మళ్లీ పడగ విప్పకుండా అడ్డుకునేందుకుగాను సిరియాలో అమెరికా ప్రస్తుతం దాదాపు 900 మంది భద్రత సిబ్బందిని మోహరించింది.