US Human Rights Report On India: ప్రజాస్వామ్యం, మానవ హక్కుల అంశాలపై భారత్, అమెరికా క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతుంటాయని అమెరికా తెలిపింది. మణిపుర్‌లో జాతుల ఘర్షణ తర్వాత మానవ హక్కుల ఉల్లంఘన సంఘటనలు జరిగాయని అమెరికా వార్షిక నివేదిక పేర్కొన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. అగ్రరాజ్య విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మానవ హక్కుల విధానాలపై రూపొందించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. అప్పటి ఘటనను ప్రధాని మోదీ సిగ్గుచేటని అభివర్ణించారని, చర్యలు చేపట్టాలని కోరారని అమెరికా తెలిపింది. బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC)పై ఆదాయ పన్ను విభాగం దాడులు, గుజరాత్ న్యాయస్థానం రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష వంటి అంశాలను అమెరికా వార్షిక నివేదిక ప్రస్తావించింది. అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ నివేదికను విడుదల చేశారు. మానవ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి కొన్ని సానుకూల అంశాలను కూడా ఇందులో ప్రస్తావించారు.
మణిపుర్‌లో మే 3 నుంచి నవంబర్ 15 మధ్య కనీసం 175 మంది మరణించారని నివేదికలో పేర్కొంది. 60,000మందికి పైగా నిరాశ్రయులయ్యారని తెలిపింది. అలాగే కార్యకర్తలు, జర్నలిస్టుల ఇళ్లు, వ్యాపారాలు, ప్రార్థనా స్థలాలు ద్వంసం చేయడం, మహిళలపై జరిగిన దాడులు గురించి తెలిపింది. మణిపుర్ హింసను ఆపేందుకు, మానవతా సహాయం అందించడంలో ప్రభుత్వం జాప్యంపై రాజకీయ పార్టీలు, స్థానిక మానవ హక్కుల సంఘాలు విమర్శించాయని నివేదికలో ప్రస్తావించింది. రాజకీయ ప్రతిపక్షాలపై పార్టీలు తప్పుడు వ్యూహాలను ఉపయోగిస్తున్నారని, వాటినే భద్రతా ముప్పుగా చిత్రీకరిస్తున్నాయని పేర్కొంది. జమ్ము కశ్మీర్లో ప్రస్తావను నివేదికలో తెలిపింది.