US Elections Results 2024 : అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు ఫలితాలు వెలువడిన 23 రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేసిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, మరో ఏడు రాష్ట్రాల్లో అధిక్యంలో ఉన్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ 13రాష్ట్రాల్లో విజయం సాధించగా, మరో ఐదు రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. 7 స్వింగ్ రాష్ట్రాలకుగాను ఆరింటిలోనూ ట్రంప్ ముందంజలో ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లో ఈ రాష్ట్రాలు ప్రభావితం చేయనున్నాయి. పాపులర్ ఓట్లలోనూ ట్రంపే ముందంజలో ఉన్నారు. ట్రంప్‌నకు 52శాతం, కమలా హారిస్‌కు 46.2 శాతం పాపులర్ ఓట్లు వచ్చాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ హవా- 23రాష్ట్రాలు కైవసం- కమల పరిస్థితేంటి? - US ELECTIONS RESULTS 2024
అమెరికా ఎన్నికల ఫలితాలు- ట్రంప్ @ 214, హారిస్ @ 174
Published : Nov 6, 2024, 9:47 AM IST
ఇప్పటివరకు 23రాష్ట్రాల్లో ట్రంప్, మరో 13రాష్ట్రాల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ విజయదుందుభి మోగించారు. మిస్సిసిపీ, సౌత్ కరోలినా, టెన్నెసీ, వర్జీనియా, ఇండియానా, ఫ్లోరిడా, ఆర్కాన్సస్, ఒహియో, వ్యోమింగ్, నార్త్ డకోట, సౌత్ డకోట, నెబ్రాస్కా, ఒక్లహామా, లుసియానా, వెస్ట్ వర్జీనియా, అలబామా, టెక్సాస్, మిస్సోరీ, మోంటానా, కాన్సస్, ఒక్లాహామా, అయోవా, ఐడాహో రాష్ట్రాల్లో ట్రంప్ గెలుపొందారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఇల్లినాయిస్, మేరీలాండ్, వెర్‌మౌంట్, న్యూయార్క్, మస్సాచుసెట్స్, కన్నెటిక్టికట్, రోడ్ ఐలాండ్లో, డెలావర్, న్యూజెర్సీ, కొలరాడో, న్యూమెక్సికో, వాషింగ్టన్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో విజయం సాధించారు. అమెరికాలో మొత్తం 538ఎలక్టోరల్ ఓట్లు ఉండగా శ్వేతసౌధంలో అడుగుపెట్టడానికి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం కానున్నాయి. ఇంతవరకు 393ఎలక్టోరల్ ఓట్ల ఫలితాలు వెలువడగా అందులో 214 ఓట్లు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, 179ఎలక్టోరల్ ఓట్లు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ సాధించారు.
మరోవైపు, డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. అతిపెద్ద నగరమైన పెన్సిల్వేనియాలోని ఓటింగ్ విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తంచేశారు. పెన్సిల్వేనియాలో అనూహ్యంగా అధిక ఓటర్లు ఉన్నట్లు అక్కడి వార్తాసంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. ఈక్రమంలో దీనిపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "పెన్సిల్వేనియాలో జరుగుతున్న భారీ మోసం గురించి చర్చలు జరుగుతున్నాయి. చట్టం అమలులోకి వస్తోంది!" అని తన ట్రూత్ సామాజిక మాధ్యమంలో రాసుకొచ్చారు. మరోవైపు ఈ ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని సిటీ కమిషనర్ సేథ్ బ్లూస్టెయిన్ వెల్లడించారు. తప్పుడు సమాచార వ్యాప్తికి ఈ ఆరోపణలను ఉదాహరణంగా అభివర్ణించారు. అదేవిధంగా పెన్సిల్వేనియాలో ఓటింగ్ సక్రమంగా సాగుతుందని తెలిపారు.