US Elections 2024 :యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం పోలింగ్ ప్రారంభం కానుంది. రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తొలిసారి శ్వేతసౌధాధిపతి కావాలని కమలా హారిస్ ఉవ్విళ్లూరుతున్నారు. పోలింగ్ కోసం లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సహా సీక్రెట్ సర్వీసెస్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో ఇప్పటికే 6.8 కోట్ల మంది ముందస్తు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి తటస్థ ఓటర్లు ఎవరివైపు మొగ్గితే వారినే విజయం వరించనుంది. సర్వే సంస్థలు మాత్రం ఫలితంపై రకరకాల అంచనాలు వెల్లడిస్తున్నారు.
ఆ రాష్ట్రాల్లో స్వల్ప ఆధిక్యంలో హారిస్
నార్త్ కరోలినా, జార్జియాల్లో కమలా హారిస్ బలం పుంజుకుంటున్నారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. వీటితో పాటు, నెవడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్‌ల్లో స్వల్ప ఆధిక్యంలో ఉన్నారని పేర్కొంది. పెన్సిల్వేనియాలో ఆమె ఆధిక్యానికి ట్రంప్ గండికొట్టారని, అలాగే ఆరిజోనాలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటున్నారని వెల్లడించింది. అయితే అయోవా రాష్ట్రంలో హారిస్ ముందున్నారంటూ మరో సర్వే అంచనా వేసింది. ఆ ప్రకారం కమలా హారిస్ 47 శాతం, డొనాల్డ్ ట్రంప్ 44 శాతం ఓటర్ల మద్దతును పొందుతున్నారని డెస్ మొయినెస్ రిజిస్టర్ న్యూస్‌పేపర్ తెలిపింది. ఈ సర్వేను అసత్యాల ప్రచారం అంటూ ట్రంప్ కొట్టిపారేశారు.
ఆధిక్యంలో ట్రంప్!
ఎన్నికలకు కొన్ని గంటల ముందు కీలకమైన స్వింగ్ స్టేట్స్‌లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పుంజుకొన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు అట్లాస్ ఇంటెల్ తాజా పోల్స్ గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం మీద 48 శాతం మంది ట్రంప్‌నకు అనుకూలంగా ఉన్నారని, ఇది కమలా హారిస్‌కు లభించిన మద్దతు కంటే 1.8 శాతం అధికమని సర్వేలో వెల్లడించింది. ఈ నెల తొలి రెండ్రోజుల్లో ఈ సర్వేను నిర్వహించారు. స్వింగ్ స్టేట్స్‌గా పేరున్న ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లలో ట్రంప్ హవానే ఉన్నట్లు సర్వే తెలిపింది. ఆరిజోనాలో 51.9 శాతం, నెవడాలో 51.4, నార్త్ కరోలినాలో 50.4 శాతం ట్రంప్‌నకు మద్దతు పలికినట్లు పేర్కొంది.
పోటీలో వీరిద్దరే కాదు!
ఎన్నిక ప్రధానంగా కమలా హారిస్ (డెమొక్రటిక్ పార్టీ), డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్ పార్టీ)ల మధ్యే సాగుతున్నా మరికొందరు కూడా బరిలో ఉన్నారు. లిబర్టేరియన్ పార్టీ తరఫున ఛేస్ ఒలివర్, గ్రీన్‌పార్టీ అభ్యర్థిగా జిల్ స్టెయిన్, స్వతంత్ర అభ్యర్థిగా రాబర్ట్ జాన్ ఎఫ్ కెనడీ జూనియర్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. పోటీ హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల ఈ మూడో అభ్యర్థులకు వచ్చే ఓట్లు ట్రంప్, హారిస్‌ల అవకాశాలను దెబ్బతీయొచ్చు.
ఓట్లు కాదు 270 సీట్లు రావాలి
అమెరికా అధ్యక్ష ఎన్నిక పరోక్ష ఎన్నిక. అంటే ప్రజలు నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకోరు. అమెరికా ఓటర్లు ప్రస్తుత ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ లేదా ఇతర అభ్యర్థులకే ఓటు వేసినా అధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవటం లేదు. అధ్యక్షుడిని నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులను మాత్రమే ప్రజలు ఎన్నుకుంటున్నారు. మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి 538 ఎలక్టోరల్ కాలేజీ సీట్లుంటాయి. ఈ 538 మందిలో 270 వచ్చిన వారు అధ్యక్షులవుతారు.
ఎవరికి ఎన్ని రావాలి?
ఆయా రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా ఒక్కోరాష్ట్రానికి ఒక్కోలా ఎలక్టోరల్ కాలేజీ స్థానాలుంటాయి. ఉదాహరణకు కాలిఫోర్నియాకు అత్యధికంగా 54, టెక్సాస్‌కు 40 ఎలక్టోరల్ సీట్లుండగా, తక్కువ జనాభాగల వయోమింగ్‌కు మూడు ఎలక్టోరల్ ఓట్లు కేటాయించారు. మంగళవారం ప్రజల ఓట్ల ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని ఎలక్టోరల్ సీట్లు వచ్చాయనేది తెలుస్తుంది. మైన్, నెబ్రాస్కా రాష్ట్రాలు మాత్రం దామాషా పద్ధతిలో ఎలక్టోరల్ ఓట్లను కేటాయిస్తాయి. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ కాలేజీ స్థానాలన్నీ వెళ్తాయి. ఉదాహరణకు కాలిఫోర్నియాకు 54 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. అక్కడ ఈసారి ఎన్నికల్లో కమలా హారిస్‌కు సగం కంటే ఎక్కువగా (50.1 శాతం) ఓట్లు వస్తే ఆ రాష్ట్రానికి చెందిన 54 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అన్ని డెమొక్రాటిక్ పార్టీ ఖాతాలో పడిపోతాయి. అంటే డెమొక్రాటిక్ ఎలక్టర్లు ఎలక్టోరల్ కాలేజీకి ఎన్నికవుతారు. అందుకే దేశవ్యాప్తంగా ఎక్కువ ఓట్లు వచ్చేదానికంటే 270 ఎలక్టోరల్ కాలేజీ సీట్లు వచ్చేలా ఓట్లు రావటం అధ్యక్ష పీఠానికి అత్యవసరం.
సమానంగా వస్తే
ఎలక్టోరల్ కాలేజీలో ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకూ 269 చొప్పున ఓట్లు వచ్చి, టై అయితే అధ్యక్షుడిని కాంగ్రెస్‌లోని దిగువ సభ (ప్రతినిధుల సభ) ఎన్నుకుంటుంది. ఉపాధ్యక్షుడిని ఎగువ సభ (సెనెట్) ఎన్నుకుంటుంది. అందుకే అధ్యక్ష ఎన్నికతో పాటే ఆ సభలకూ జరుగుతున్న ఎన్నికలు కీలకమే.
అధ్యక్ష ఫలితాలు అప్పుడే
భారత్‌లో మాదిరిగా అమెరికాలో ఓటింగ్ నిబంధనలు ఏకీకృతంగా ఉండవు. దేశాధినేతను ఎంచుకునే ఎన్నికే అయినా ఒక్కోరాష్ట్రంలో ఒక్కోలా నిబంధనలుంటాయి. అందుకే దేశవ్యాప్తంగా నవంబరు 5న పోలింగ్ అయినప్పటికీ అనేక రాష్ట్రాల్లో ఓటింగ్ నెలరోజుల ముందే మొదలైంది. పోస్టు ద్వారా, ముందస్తు ఓటింగ్‌కు చాలా రాష్ట్రాలు అనుమతిస్తున్నాయి. అలాగే ఓట్ల లెక్కింపూ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. అందుకే వెంటనే ఫలితం తెలియటం కష్టం. కానీ ఎన్నికల రోజు రాత్రికల్లా ఫలితాల ట్రెండ్ రావొచ్చు. మరీ హోరాహోరీగా ఉంటే మాత్రం కొంచెం ఆలస్యం కావొచ్చు. 2020లో ఎన్నిక తేదీ తర్వాత నాలుగు రోజులకు ఫలితం తేలింది. 2000 సంవత్సరంలో ఫలితం తేలటానికి నెలరోజులపైనే పట్టింది.
జనవరిలో ప్రమాణం
డిసెంబరు 17న ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులు సమావేశమై అధ్యక్షుడిని ఎంపిక చేస్తారు. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను 2025 జనవరి 6న అమెరికా పార్లమెంటులోని దిగువ సభ (ప్రతినిధుల సభ) ఛాంబర్‌లో లెక్కిస్తారు. కొత్త అధ్యక్షుడు 2025 జనవరి 20న ప్రమాణస్వీకారం చేస్తారు.