US Elections 2024 :ప్రపంచం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు మంగళవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం సాయంత్రం) మొదలైంది. రెండోసారి అధికారాన్ని ఎలాగైనా సాధించాలని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తొలిసారి శ్వేతసౌధం పగ్గాలు చేపట్టాలని ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, నువ్వా నేనా అన్నట్టు ప్రచారం నిర్వహించారు.
ఎన్నిక ప్రధానంగా కమలా హారిస్ (డెమోక్రటిక్ పార్టీ), డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్ పార్టీ)ల మధ్యే సాగుతున్నా మరికొందరు కూడా బరిలో ఉన్నారు. లిబర్టేరియన్ పార్టీ తరఫున ఛేస్ ఒలివర్, గ్రీన్‌పార్టీ అభ్యర్థిగా జిల్ స్టెయిన్, స్వతంత్ర అభ్యర్థిగా రాబర్ట్ జాన్ ఎఫ్ కెనడీ జూనియర్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. పోటీ హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల ఈ మూడో అభ్యర్థులకు వచ్చే ఓట్లు- ట్రంప్, హారిస్‌ల అవకాశాలను దెబ్బతీయొచ్చు.
అమెరికా ఎన్నికల విధానం ఇలా!
అమెరికా అధ్యక్ష ఎన్నిక పరోక్ష ఎన్నిక. అంటే ప్రజలు నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకోరు. అమెరికా ఓటర్లు ప్రస్తుత ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ లేదా ఇతర అభ్యర్థులకే ఓటు వేసినా అధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవటం లేదు. అధ్యక్షుడిని నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులను మాత్రమే ప్రజలు ఎన్నుకుంటున్నారు. మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి 538 ఎలక్టోరల్ కాలేజీ సీట్లుంటాయి. ఈ 538 మందిలో 270 వచ్చిన వారు అధ్యక్షులవుతారు. ఆయా రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా ఒక్కోరాష్ట్రానికి ఒక్కోలా ఎలక్టోరల్ కాలేజీ స్థానాలుంటాయి.
ఉదాహరణకు, కాలిఫోర్నియాకు అత్యధికంగా 54, టెక్సాస్‌కు 40 ఎలక్టోరల్ సీట్లుండగా తక్కువ జనాభాగల వ్యోమింగ్‌కు మూడు ఎలక్టోరల్ ఓట్లు కేటాయించారు. మంగళవారం ప్రజల ఓట్ల ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని ఎలక్టోరల్ సీట్లు వచ్చాయనేది ఖరారవుతుంది. మైన్, నెబ్రాస్కా రాష్ట్రాలు మాత్రం దామాషా పద్ధతిలో ఎలక్టోరల్ ఓట్లను కేటాయిస్తాయి. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ కాలేజీ స్థానాలన్నీ వెళతాయి.
ఉదాహరణకు కాలిఫోర్నియాకు 54 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. అక్కడ ఈసారి ఎన్నికల్లో కమలా హారిస్‌కు సగం కంటే ఎక్కువగా (50.1 శాతం) ఓట్లు వస్తే ఆ రాష్ట్రానికి చెందిన 54 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు గంపగుత్తగా డెమోక్రాటిక్ పార్టీ ఖాతాలో పడిపోతాయి. అంటే డెమోక్రాటిక్ ఎలక్టర్లు ఎలక్టోరల్ కాలేజీకి ఎన్నికవుతారు. అందుకే దేశవ్యాప్తంగా ఎక్కువ ఓట్లు వచ్చేదానికంటే 270 ఎలక్టోరల్ కాలేజీ సీట్లు వచ్చేలా ఓట్లు రావటం అధ్యక్ష పీఠానికి అత్యవసరం!