US Destroys Houthi Missiles: గల్ఫ్ ఆఫ్ ఆడెన్‌లో శనివారం ఓ వాణిజ్య నౌకపై హౌతీ రెబల్స్ క్షిపణితో దాడికి పాల్పడ్డారు. వారిపై ఇరాన్ వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత జరిగిన తొలి ఘటన ఇదే. వాస్తవానికి ఎర్ర సముద్రం నడవాలో తరచూ నౌకలపై దాడులు చేసే హౌతీలు దాదాపు రెండువారాల పాటు విరామం ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ దాడులు ప్రారంభించారు. దీనికిగల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
హమాస్ నేత హనియా హత్య సహా కీలక పరిణామాల తర్వాత హౌతీలు మరోసారి దాడులు ప్రారంభించడం ఆందోళన కలిగిస్తోంది. క్షిపణి దాడి జరిగినట్లు నౌకలోని భద్రతాధికారి ధ్రువీకరించారని యూకే మేరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది. కానీ, ఈ దాడి వల్ల మంటలు చెలరేగడం, నీరు లోపలికి రావడం, ఆయిల్ లీక్ కావడం వంటి ప్రమాదమేమీ జరగలేదని పేర్కొంది. లైబీరియన్ జెండాతో ప్రయాణిస్తున్న గ్రోటన్ నౌకపై ఈ దాడి జరిగినట్లు తెలిపింది. యూఏఈ నుంచి సౌదీ అరేబియా వెళ్తున్నట్లు చెప్పింది. హౌతీలు మాత్రం ఇప్పటి వరకు దాడికి బాధ్యత వహిస్తూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
హౌతీ క్రూయిజ్ మిసైల్ ధ్వంసం
యెమెన్‌లో హౌతీ రెబల్స్‌కు చెందిన ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణిను విజయంవంతంగా నాశనం చేసినట్లు అమెరికా తెలిపింది. గత 24 గంటల్లోనే యూఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు ఈ క్రూయిజ్ క్లిపణిని ధ్వంసం చేసినట్లు శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
పాలస్తీనాలో దాడులు
పాలస్తీనాలోని వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ రెండు వైమానిక దాడులు నిర్వహించింది. ఈ ఘటనల్లో 9 మంది మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. గతేడాది అక్టోబర్ 7 దాడి తర్వాత గాజాలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 40వేల మంది పౌరులు మరణించగా, పాలస్తీనాలో 590 మంది బలయ్యారు. బుధవారం టెహ్రాన్‌లో హమాస్ రాజకీయ నేత ఇస్మాయిల్ హనియెహ్, అంతకుముందు బీరూట్‌లో హెజ్బుల్లా కమాండర్ ఫౌద్ షుకూర్ హత్యల తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు బాగా పెరిగిపోయాయి. హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులు జరిపే అవకాశం ఉందని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. తాము కూడా ఇజ్రాయెల్‌ను శిక్షిస్తామని ఆ దేశ సుప్రీం లీడర్ ఖమైనీ ప్రతిజ్ఞ చేశారు. ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌తో పాటు లెబనాన్‌లోని హెజ్‌బొల్లాకు గట్టి హెచ్చరికలు చేస్తోంది. ఇటు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ చర్చలు కొనసాగుతాయని, ఇందుకు ఇజ్రాయెల్ నిఘా సంస్థైన మొస్సాద్ చీఫ్ బృందం కైరోకు చేరుకుందని ఈజిప్టు తెలిపింది. హనియే హత్య ఉద్రిక్తతలకు మరింతి పెంచిన నేపథ్యంలో కాల్పుల విరమణ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని టెల్ అవీవ్‌ను అమెరికా కోరుతోంది.
ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడి
లెబనాన్‌లోని బీరట్‌లో తమ సీనియర్ కమాండర్ ఫౌద్ షుకూర్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా విరుచుకుపడింది. ఇజ్రాయెలోని గలిలీ ప్రాంతంపైకి ఈ తెల్లవారుజామున క్షిపణులతో దాడులకు పాల్పడింది. అప్రమత్తమైన నెతన్యాహు సైన్యం ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్‌తో వాటిని సమర్థంగా కూల్చివేసింది. గాజా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి హమాస్‌కు హెజ్‌బొల్లా అండగా ఉంటోంది. అప్పటి నుంచి ఇజ్రాయెల్‌పై పలుమార్లు దాడులకు పాల్పడింది. బీరట్‌లో తమ సీనియర్ కమాండర్‌ను ఇజ్రాయెల్ చంపడంతో రగిలిపోతోంది. దీనికి తోడు హమాస్ కమాండర్ హనియా ఇరాన్‌లో హత్యకు గురి కావడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్‌పై దాడులు చేయాలని, ఇరాన్, హమాస్, హెజ్‌బొల్లా ప్రణాళికలు రచిస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని చెప్పిన అమెరికా తమ యుద్ధనౌకలు, ఫైటర్ జెట్‌లను పశ్చిమాసియాకు పంపింది.
ఇజ్రాయెల్‌తో డైరెక్ట్ వార్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశాలు! IDF హైఅలర్ట్! - Hezbollah Israel Rocket Attacks
ఇజ్రాయెల్‌పైకి హెజ్‌బొల్లా రాకెట్ల దాడి - తిప్పికొట్టిన ఐడీఎఫ్ - Hezbollah Israel War