UN On Israel Air Strike :ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం సామాన్య ప్రజలతో పాటు వారికి సేవలందిస్తున్న సిబ్బంది ప్రాణాల మీదకు తెస్తోంది. గాజా పట్టీలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 34 మంది మరణించినట్టు పాలస్తీనా ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మృతుల్లో తమ సిబ్బంది కూడా ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని UN చీఫ్ ఆంటోనియో గుటెరస్ ధ్రువీకరించారు.
గాజాలోని ఓ పాఠశాలలో 12వేల మంది ఆశ్రయం పొందుతున్న చోట ఇజ్రాయెల్ తాజాగా దాడి చేసిందని చెప్పారు. ఈ దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్న గుటెరస్, అంతర్జాతీయ మానవతాచట్టం ఉల్లంఘనలను ఇజ్రాయెల్ వెంటనే ఆపాలన్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో యూఎన్ పాలస్తీనియన్ రిఫ్యూజీ ఏజెన్సీ- U.N.R.W.Aకి చెందిన ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎవరినీ వదిలిపెట్టడం లేదు!
ఇజ్రాయెల్ వైమానిక దాడిపై U.N.R.W.A ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేసింది. నుసీరత్‌లోని పలు ప్రాంతాలతో పాటు ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిందని పేర్కొంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలైన నాటి నుంచి ఈ స్థాయిలో ఒకే దాడిలో తమ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం తొలిసారని తెలిపింది. మృతుల కుటుంబాలకు U.N.R.W.A ప్రగాఢ సానుభూతిని తెలిపింది. యుద్ధం మొదలైన దగ్గరి నుంచి ఆ పాఠశాలపై ఇప్పటికి ఐదుసార్లు దాడి జరిగిందని, అక్కడ మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారని వివరించింది. గాజాలో ఎవరూ సురక్షితంగా లేరన్న U.N.R.W.A ఎవరినీ వదిలిపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పాఠశాలలు, పౌరులకు సంబంధించిన మౌలిక సదుపాయాలపై దాడులు జరగకూడదని, ఘర్షణపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని అభ్యర్థించింది.