తెలంగాణ

telangana

ETV Bharat / international

'రఫాపై సైనిక చర్యను తక్షణమే ఆపండి'- ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం - Israel Gaza War - ISRAEL GAZA WAR

ICJ Ruling On Israel : అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో ఇజ్రాయెల్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. రఫాపై సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని శుక్రవారం ఐసీజే ఆదేశాలిచ్చింది.

ICJ Ruling On Israel
ICJ Ruling On Israel (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 7:36 AM IST

Updated : May 25, 2024, 8:30 AM IST

ICJ Ruling On Israel : దక్షిణ గాజాలోని పాలస్తీనీయులపై ఇజ్రాయెల్‌ మారణహోమానికి పాల్పడుతోందంటూ దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై అంతర్జాతీయ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. రఫా పట్టణంపై సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. అంతే కాదు గాజాకు మానవతాసాయం అందేలా ఈజిప్ట్-గాజా సరిహద్దును కూడా తెరవాలని పేర్కొంది.

గాజాలో ఇజ్రాయెల్‌ నరమేధానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ దక్షిణాఫ్రికా వేసిన పిటిషన్‌పై శుక్రవారం 15 న్యాయమూర్తుల ఐసీజే ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పాలస్తీనాలో పరిస్థితులు క్షీణించిపోయాయని, వాటిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఇజ్రాయెల్‌ను ఆదేశించినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రఫా ప్రభుత్వానికి ఆటంకం కలిగేలా ఇజ్రాయెల్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. మానవతా దృక్పథంతో ఈజిప్ట్‌-గాజా సరిహద్దును కూడా తెరవాలని, అలాగే దీని పురోగతిపై నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే గాజా నుంచి పూర్తిగా సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్‌కు ఆదేశాలివ్వాలని దక్షిణాఫ్రికా చేసిన వినతికి ఐసీజే అధ్యక్షుడు జడ్జి నవాఫ్ సలామ్ సానుకూలంగా స్పందించలేదు. కాల్పుల విరమణ ఆదేశాలివ్వాలంటూ చేసిన విజ్ఞప్తినీ తిరిస్కరించారు.

'అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌ చర్యలతో పాలస్తీనియన్ల హక్కులకు కోలుకోలేని హాని కలిగే ప్రమాదం ఉంది. గాజా స్ట్రిప్‌లోని పౌరుల భద్రతను మెరుగుపరచడానికి, ముఖ్యంగా ఇటీవల రఫా నుంచి తరలిన వారి భద్రత కోసం ఇజ్రాయెల్‌ చేపట్టిన ఏర్పాట్లు, ఇతర చర్యలు సరిపోతాయని ఈ న్యాయస్థానం భావించడం లేదు. రఫాలో సైనిక దాడి ఫలితంగా పాలస్తీనియన్లు ప్రమాదం అంచున ఉన్నారు' అని నవాఫ్​ పేర్కొన్నారు. కాగా, అంతర్జాతీయ న్యాయస్థాన ఉత్తర్వులను ఇజ్రాయెల్‌ పాటించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

'ఉగ్రవాద దాడులను ఆపకుండా ఏ శక్తి ఆపలేదు'
మరోవైపు అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఇజ్రాయెల్ ఖండించింది. తన పౌరులను రక్షించకుండా, గాజాలో హమాస్‌ ఉగ్రవాదులను నిరోధించకుండా ఈ భూమిపై ఏ శక్తీ తమని ఆపలేదని ఇజ్రాయెల్ వ్యాఖ్యానించింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు హమాస్ నేతలపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని ఐసీసీ చీఫ్ చేసిన అభ్యర్థనలకు యూస్ సెనేటర్ బెర్నీ శాండర్స్ మద్దతు ఇచ్చారు. 'ఐసీసీ ఈ అరెస్ట్ వారెంట్లు జారీ అమలు జరగవచ్చు, జరగకపోవచ్చు. సమాజం అంతర్జాతీయ చట్టాలను పాటించాలి. కానీ నైతిక విలువలు లేకుండా ప్రపంచం యుద్ధాలతో నిండిపోతుంది' అని శాండర్స్ అన్నారు. అయితే ఈ అరెస్ట్ వారెంట్లను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా వ్యతిరేకించారు.

Last Updated : May 25, 2024, 8:30 AM IST

ABOUT THE AUTHOR

...view details