Trump on Birthright US Citizenship :డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్ష హోదాలో వైట్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలిరోజే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో అత్యంత ముఖ్యమైనది జన్మతః పౌరసత్వంపై వేటు. దాదాపు 100 ఏళ్లగా అనుసరిస్తున్న విధానానికి స్వస్తి పలికింది. ఈ నిర్ణయం ప్రభావం అమెరికాలో ఉంటున్న ఎంతోమంది భారతీయులపై పడనుంది.
అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారితో పాటు విద్యార్థుల, టూరిస్టు, తాత్కాలిక వర్క్ వీసాలపై దేశంలో ఉంటున్న వారికి జన్మించే పిల్లలకు ఇక అమెరికా పౌరసత్వం లభించదు. ఈ తరహా పౌరసత్వం ప్రపంచంలో ఏ దేశం కూడా ఇవ్వడం లేదని, తాము కూడా ఇచ్చేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు. తల్లిదండ్రుల్లో కనీసం ఒకరికైనా అమెరికా పౌరసత్వం, శాశ్వత నివాసం, గ్రీన్ కార్డ్, అమెరికా మిలిటరీ సభ్యత్వం ఇలా ఏదైనా ఒక గుర్తింపు ఉంటేనే వారి పిల్లలకు జన్మతః దేశ పౌరసత్వం ఇస్తామని తేల్చి చెప్పారు. ఈమేరకు నిబంధనలతో 'ప్రొటెక్టింగ్ ది మీనింగ్ అండ్ వ్యాల్యూ ఆఫ్ అమెరికన్ సిటిజెన్‌షిప్' శీర్షికన సంచలన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను ట్రంప్ జారీ చేశారు.
అయితే అమెరికా మాత్రమే ఇలాంటి పౌరసత్వం అందిస్తోందని ట్రంప్ తప్పుగా వ్యాఖ్యానించారు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాలు ఈ విధానంలోనే పౌరసత్వాన్ని అందజేస్తున్నాయి. అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ శరణార్థుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది.
'చట్టబద్ధంగా అమలు అసాధ్యం'
ఈ ఆర్డర్ 30 రోజుల తర్వాతి నుంచి అమల్లోకి రానుంది. మీరు జారీ చేసిన ఆర్డర్‌ను కోర్టు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించే ఛాన్స్ ఉందా ?’’ అని ఒక విలేకరు ట్రంప్‌ను ప్రశ్నించారు. 'అలా జరగొచ్చు. అయితే మా దగ్గర మంచి ఆధారాలు ఉన్నాయి. అమెరికా ప్రజలు కొన్ని దశాబ్దాలుగా దీన్ని చేయాలని కోరుతున్నారు. అందుకే ఈ ఆర్డర్ జారీ చేశాం' అని ట్రంప్ సమాధానం ఇచ్చారు. మరోవైపు ఈ ఆర్డర్ న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ కారణంగా ఈ ఉత్తర్వును చట్టబద్ధంగా అమలు చేయడం సాధ్యం కాదని వాదిస్తున్నారు.
అమెరికాలోని భారతీయులపై ప్రభావం ఎంత ?
2024 నాటికి అమెరికాలో దాదాపు 54 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వీరు ఆ దేశ జనాభాలో 1.47 శాతానికి సమానం. అమెరికా జనాభాలో 34 శాతం మంది వలసదారులే. వీరు జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల మందికి సమానం. అమెరికా ప్రభుత్వం విదేశీ వలసదారుల విషయంలో ఏదైనా విధానపరమైన వివాదాస్పద నిర్ణయం తీసుకుంటే, దాని ప్రభావంతో దేశంలోని 34 శాతం మందిపై ప్రతికూలంగా పడుతుంది. అందుకే అమెరికా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండి, విదేశీ వలసదారులను ఇబ్బందిపెట్టేలా ఉన్న ఆదేశాలను అక్కడి న్యాయస్థానాలు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది.