Trump Interview For FBI Chief Position :అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రేపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ట్రంప్ రన్నింగ్ మేట్, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ ఓ పోస్ట్ ద్వారా తెలిపారు. అయితే, వెంటనే ఆ పోస్టును డిలీట్ చేశారు.
ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవి కోసం ఇంటర్వ్యూలు
"అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను కలవనున్నాను. ఎఫ్‌బీఐ డైరెక్టర్ సహా మా ప్రభుత్వం కోసం అనేక స్థానాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాం" అని వాన్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. వెంటనే ఆ పోస్టును తొలగించారు. అయితే, గతంలోనూ ఓ శక్తివంతమైన ఎఫ్‌బీఐ డైరెక్టర్ కావాలంటూ జేడీ వాన్స్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఉన్న క్రిస్టోఫర్ వ్రేకు ట్రంప్ ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం.
'ఆయనే నిర్ణయాలు తీసుకుంటారు'
అయితే, జేడీ వాన్స్ వ్యాఖ్యలపై ఎఫ్‌బీఐ ప్రతినిధులు స్పందించేందుకు నిరాకరించారు. ట్రంప్ తన కార్యవర్గంలో ఎవరు పనిచేయాలనే దానిపై ఆయనే నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆ నిర్ణయాలను ఆయనే స్వయంగా ప్రకటిస్తారని ట్రంప్ ట్రాన్సిషన్ టీమ్ ప్రతినిధి తెలిపారు.
ఎఫ్‌బీఐ డైరెక్టర్ పోస్టు కోసం తీవ్ర పోటీ
10 ఏళ్లపాటు పదవీకాలం ఉండే ఎఫ్‌బీఐ డైరెక్టర్ పోస్టుకు పోటీ చాలా తీవ్రంగా ఉంది. వ్యూహకర్త స్టీవ్ బన్నన్తో సహా ట్రంప్ సన్నిహితులు చాలా మంది ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. ట్రంప్‌నకు అత్యంత విధేయుడైన కాష్ పటేల్, మాజీ ఎఫ్‌బీఐ ఏజెంట్ మైక్ రోజర్స్ తదితరులు ఈ పదవిని ఆశిస్తున్నారు.
విద్యాశాఖ మంత్రిగా మెక్‌మాన్
డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కార్యవర్గ విస్తరణలో భాగంగా ప్రపంచ కుబేరుడు ప్రొఫెషనల్ రెజ్లర్ అయిన లిండా మెక్‌మాన్‌కు విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. మెక్‌మాన్ 2009 నుంచి కనెక్టికట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఓ ఏడాది పాటు పనిచేశారు. ఆ తరువాత ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌కు కొంతకాలం నేతృత్వం వహించారు.