తెలంగాణ

telangana

ETV Bharat / international

కోర్టుకు ట్రంప్​ రూ.1460 కోట్ల బాండు సమర్పణ- అలా జరిగితే మొత్తం పోయినట్లే! - Trump Bond In Civil Fraud Case - TRUMP BOND IN CIVIL FRAUD CASE

Trump Bond In Civil Fraud Case : తప్పుడు సమాచారంతో బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేసి లబ్ధి పొందారన్న కేసులో 175 మిలియన్‌ డాలర్ల జరిమానాను బాండు రూపంలో ట్రంప్‌ కోర్టుకు సమర్పించారు.

Trump Bond In New York Civil Fraud Case
Trump Bond In New York Civil Fraud Case

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 1:55 PM IST

Trump Bond In Civil Fraud Case :బ్యాంకులను మోసం చేశారన్న కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా కోర్టులో 175 బిలియన్‌ డాలర్లు (రూ.1460 కోట్ల) బాండు సమర్పించారు. తద్వారా తనకు విధించిన 454 మిలియన్‌ డాలర్ల జరిమానా విషయంలో తదుపరి చర్యలు తీసుకోకుండా కోర్టు ఆదేశాల మేరకు నడుచుకొన్నారు. దీంతో ప్రభుత్వం ఆయన ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉండదు.

తనకు సంబంధించిన ఆస్తులను నిజ విలువ కంటే అధికంగా చూపి బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేసి వ్యాపార రుణాలు, బీమా పొందారన్న అభియోగాలను ట్రంప్‌ ఎదుర్కొంటున్నారు. ఈ అభియోగాలపై కేసు నమోదైంది. న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌, డెమోక్రాట్‌ నేత లెటిటియా జేమ్స్‌ ఈ దావా వేశారు. దీనిపై రెండున్నర నెలల పాటు విచారణ జరిపిన న్యాయస్థానం గత ఫిబ్రవరిలో ఆయనకు 454 మిలియన్‌ డాలర్ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై అప్పీల్‌కు వెళ్తామని జరిమానాను రద్దు చేయాలని ట్రంప్‌ న్యాయవాదుల బృందం కోర్టును కోరింది. అప్పటి వరకు ఆస్తుల జప్తు వంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. దీంతో కోర్టు హామీ కింద 175 మిలియన్‌ డాలర్లు కోర్టులో సమర్పించాలని ఆదేశించింది.

ఒకవేళ దోషిగా తేలితే?
పైకోర్టులో ట్రంప్‌ దోషిగా తేలితే ఇప్పుడు దాఖలు చేసిన 175 మిలియన్‌ డాలర్ల బాండు ఆయనకు తిరిగి రాదు. అంతేకాక 454 మిలియన్‌ డాలర్ల మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్దోషిగా తేలితే బాండును తిరిగి ఇచ్చేస్తారు. ఈ అభియోగాలపై సెప్టెంబరులో వాదనలు జరగనున్నాయి. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని ట్రంప్‌ ముందు నుంచి వాదిస్తూ వస్తున్నారు.

ఇప్పటికే లక్షల డాలర్లు సమర్పణ!
వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌తో తలపడేందుకు సిద్ధమైన ట్రంప్‌ను క్యాపిటల్‌ హిల్స్‌పై దాడి వంటి ఎన్నో న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టి ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత క్యాపిటల్‌ హిల్‌ ఘటనలో ఆయన పాత్రపై ఇప్పటికే కోర్టులో విచారణ కొనసాగుతోంది. అంతేకాకుండా రచయిత జీన్‌ కరోల్‌పై లైంగిక ఆరోపణల కేసులో ఆయన ఇప్పటికే కోర్టుకు 97 మిలియన్‌ డాలర్లు విలువ చేసే మొత్తాన్ని బాండు, నగదు రూపంలో సమర్పించారు. పులిట్జర్‌ పురస్కారం పొందిన పాత్రికేయులపై కేసు నమోదు చేసిన వ్యవహారంలో వారికి న్యాయపరమైన ఖర్చుల కింద కోర్టు ఆదేశాల మేరకు సుమారు 3.93 లక్షల డాలర్లు చెల్లించారు. మరోవైపు ఓ కంపెనీపై తప్పుడు కేసు విషయంలో బ్రిటిష్‌ కోర్టు ఆదేశాల మేరకు 3.82 లక్షల డాలర్లు లీగల్‌ ఫీజుల కింద కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దేవుడి దర్శనానికి వెళ్తుండగా ఆటోను ఢీకొట్టిన ట్రక్కు- ఐదుగురు భక్తులు దుర్మరణం - UP Road Accident

ఎన్నికల వేళ 'కచ్చతీవు' వివాదం- ఎవరు దాచారో తెలిసిందన్న జైశంకర్​! - Jaishankar Comments On Katchatheevu

ABOUT THE AUTHOR

...view details