Trump Biden Debate :అమెరికా చరిత్రలో అత్యంత కీలకమైన అధ్యక్ష చర్చకు రంగం సిద్ధమైంది. నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా తలపడనున్నారు. జూన్ 27న మొదటిసారి వారి మధ్య చర్చ జరగనుంది. జార్జియాలోని అట్లాంటాలో 90 నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్‌లో పలు కీలక అంశాలపై తమ వైఖరిని వీరిద్దరూ స్పష్టం చేయనున్నారు. స్వతంత్ర అధ్యక్ష అభ్యర్థి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ ఈ డిబేట్‌కు అర్హత సాధించలేదు. ఈ క్రమంలో వారు పలు కఠినమైన ప్రశ్నలు ఎదుర్కోనున్నారు.
81 ఏళ్ల బైడెన్, 78 ఏళ్ల ట్రంప్
ట్రంప్‌పై దూకుడైన వైఖరి ప్రదర్శించాలని బైడెన్ కోరుకుంటున్నారు. స్థిరమైన నాయకుడు కావాలో లేదా దోషిగా తేలిన వారు కావాలో తేల్చుకోమని బైడెన్ ప్రజలను కోరనున్నారు. ట్రంప్ ప్రజాస్వామ్యానికే ఓ ముప్పుగా బైడెన్ అభివర్ణించనున్నారు. అయితే తన వయసు 81 ఏళ్ల దాటడం, ఇంకో నాలుగేళ్లు అధ్యక్ష పదవి చేపట్టేందుకు మానసికంగా ఫిట్‌గా లేకపోవడం బైడెన్‌కు ప్రతికూలంగా మారింది. ఈ ఎన్నికల్లో 81 ఏళ్ల బైడెన్, 78 ఏళ్ల ట్రంప్ వయసు కూడా ప్రధానాంశంగా ఉంది.