Who Is Susie Wiles :అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచార మేనేజర్ సూసీ వైల్స్ (Susie Wiles)కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆమెను వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించారు. దీనితో ఆమె అమెరికా చరిత్రలోనే మొదటి మహిళా వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నిలిచారు.
వాస్తవానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను విజయతీరాలకు చేర్చడంలో సూసీ వైల్స్ది కీలక పాత్ర. ఎంతో పకడ్బందీగా, అత్యంత క్రమశిక్షణతో ట్రంప్ తన ప్రచారాన్ని నిర్వహించడం వెనుక ఆమె ముఖ్య పాత్ర పోషించారు. ట్రంప్ తన విజయ ప్రసంగంలో ఆమెకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినా, సూసీ సున్నితంగా నిరాకరించారు.
"సూసీ వైల్స్ చాలా కఠినమైన, తెలివైన, వినూత్న ఆలోచనలు కలిగిన వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా ఆమె గౌరవం, ప్రశంసలు పొందారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తారు. దేశం గర్వపడేలా ఆమె పనిచేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు" అని ట్రంప్ పేర్కొన్నారు.
ఫ్లోరిడాకు చెందిన సూసీ వైల్స్ దీర్ఘకాలంగా రిపబ్లికన్ వ్యూహకర్తగా ఉన్నారు. 2016, 2020ల్లో ఫ్లోరిడా రాష్ట్రంలో ట్రంప్ ప్రచార బాధ్యతలను తన భుజాలకెత్తుకున్నారు. 2010లో ఫ్లోరిడా గవర్నర్ పదవి కోసం రిక్ స్కాట్ ప్రచారాన్ని నిర్వహించారు. యుటా మాజీ గవర్నర్ జాన్ హంట్స్‌మన్ 2012 అధ్యక్ష ప్రచారానికి కూడా మేనేజర్‌గా ఆమె పనిచేశారు.
ట్రంప్ చెప్పినా - రాజీనామా చేయను!
నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించినప్పటికీ, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ పదవికి తాను రాజీనామా చేసేది లేదని జెరోమ్ పావెల్ స్పష్టం చేశారు. అంతేకాదు చట్టప్రకారం, ఫెడరల్ రిజర్వ్‌లోని ఏడుగురు గవర్నర్ల్లో ఏ ఒక్కరినీ ట్రంప్ తొలగించలేరని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ - ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పావెల్ సహా కొంత మంది అధికారులపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా జెరోమ్ పావెల్ డెమోక్రాట్‌లకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన, పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత సదరు అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఫెడ్ ఛైర్మన్‌గా జెరోమ్ పదవీకాలం 2026లో ముగియనుంది. గవర్నర్‌గా 2028 వరకు ఉంది. ఆయన కావాలనుకుంటే ఫెడ్ ఛైర్మన్‌గా వైదొలిగిన తర్వాత గవర్నర్‌గా కొనసాగవచ్చు. ఫెడ్ గవర్నర్లను అధ్యక్షుడే నామినేట్ చేస్తారు. సెనేట్ ద్వారా 14 ఏళ్ల పదవీకాలానికి నియమిస్తారు. ఫెడ్ గవర్నర్ కనుక మధ్యలో పదవీ విరమణ చేసినట్లయితే, 14 ఏళ్లకు సంబంధించి మిగిలిన కాలవ్యవధికి వేరొకరిని నియమించవచ్చు.
రెండు సెకన్లలోనే ప్రత్యేక న్యాయవాదిని తొలగిస్తా!
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 2 సెకన్లలోనే ప్రత్యేక న్యాయవాది జాక్ స్మిత్‌ను తొలగిస్తానని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆయనను ఏమాత్రం క్షమించేది లేదని తేల్చి చెప్పారు. జాక్ స్మిత్‌ను 2022లో అటార్నీ జనరల్ మెర్రిక్ గార్లాండ్ నియమించారు. స్మిత్‌ను ట్రంప్‌పై ఉన్న 2 ఫెడరల్ కేసుల్లో స్మిత్ వాదనలను వినిపిస్తున్నారు.