తెలంగాణ

telangana

ETV Bharat / international

హారిస్, ట్రంప్ ఆశలన్నీ వీటిపైనే- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ! - US ELECTIONS 2024

ట్రంప్ vs కమలా హారిస్ - అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక అంశాలివే!

US Elections 2024
US Elections 2024 (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2024, 9:43 AM IST

US Elections 2024 :అమెరికా అధ్యక్ష ఎన్నికల పర్వం కీలక ఘట్టానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. బైడెన్‌ నిష్క్రమణతో ఎన్నికల బరిలోకి దిగిన డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ అగ్రరాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దేశాన్ని మరోసారి గొప్పగా మార్చుదామన్న నినాదంతో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి దేశాధ్యక్షుడిగా నిలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దర నేతలకు కలిసి వచ్చే అంశాలను ఈ స్టోరీలో చూద్దాం.

అక్రమ వలసలు, ఆర్థిక వ్యవస్థపైనే ట్రంప్ ఫోకస్

  • ఓటర్ల విషయంలో ఆర్థిక వ్యవస్థ ప్రధాన సమస్యగా ఉంది. చాలామంది అమెరికన్లు అధిక ధరలతో సతమతమవుతున్నారు. నాలుగింట ఒకవంతు అమెరికన్లు మాత్రమే దేశ ప్రస్తుత పరిస్థితులతో సంతృప్తిగా ఉన్నారని, మూడింట రెండొంతులమంది ఆర్థిక రంగంపై అసంతృప్తిగా ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. 'నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మీరు మెరుగ్గా ఉన్నారా?' అంటూ ఎన్నికల ప్రచారాల్లో ఓటర్లను ట్రంప్‌ ప్రశ్నించారు.
  • క్యాపిటల్‌ అల్లర్లు, వరుస కేసుల్లో నేరారోపణలు, ఓ కేసులో దోషిగా తేలడం వంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, ట్రంప్‌ దూకుడు కనబర్చారు. ప్రజల్లో ఆయనకు మద్దతు ఏడాది పొడవునా 40 శాతం లేదా అంతకంటే ఎక్కువే కొనసాగింది. చాలా మంది రిపబ్లికన్లు ఆయన్ను రాజకీయ కుట్రలకు బాధితుడు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
  • అక్రమ వలసలపై ట్రంప్‌ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. బైడెన్‌ హయాంలో సరిహద్దుల్లో అక్రమ వలసలు రికార్డు స్థాయికి చేరుకున్న కారణంగా ఈ విషయంలో ఓటర్లు ట్రంప్‌నే ఎక్కువగా విశ్వసిస్తున్నట్లు పలు సర్వేలు సూచిస్తున్నాయి.
  • యూనియన్ వర్కర్ల వంటి సాంప్రదాయ డెమొక్రటిక్ మద్దతుదారులను రిపబ్లికన్ల దిశగా ఆకట్టుకునేందుకు ట్రంప్‌ కృషి చేశారు. దిగుమతులపై సుంకాల ద్వారా అమెరికన్ పరిశ్రమ వర్గాలను పరిరక్షిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. స్వింగ్ స్టేట్స్‌లోని గ్రామీణ, సబర్బన్ ప్రాంతాల్లో పోలింగ్‌ను పెంచడంలో ఆయన సఫలీకృతమైతే, మితవాద, విద్యావంతులైన రిపబ్లికన్ల నష్టాన్ని పూడ్చవచ్చు.
  • నిరంకుశ నేతలతో స్నేహం చేయడం ద్వారా ట్రంప్‌ అమెరికా మిత్రపక్షాలను అణగదొక్కారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, ట్రంప్‌ మాత్రం అనూహ్య వైఖరినే తన బలంగా చెబుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు పెద్ద యుద్ధాలు ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. బైడెన్ పాలనలో అమెరికా బలహీనంగా ఉందని, ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌లకు భారీగా నిధులు పంపుతోందని ప్రజల్లో విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా మెజారిటీ ఓటర్లు హారిస్‌తో పోలిస్తే ట్రంప్‌ను బలమైన నేతగా భావిస్తున్నారు.

హారిస్ అస్త్రాలివే!

  • డొనాల్డ్‌ ట్రంప్‌నకు అనేక సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, విభజన రాజకీయాలు చేసే నేతగా ముద్రపడిపోయింది. హారిస్‌ ఆయన్ను ఫాసిస్టుగా పేర్కొంటూ, ప్రజాస్వామ్యానికి ముప్పుగా చెబుతున్నారు. డ్రామాలు, సంఘర్షణల నుంచి ముందుకు సాగుతానని ప్రతిజ్ఞ చేశారు. ఓటర్లు తనను స్థిరత్వం కలిగిన అభ్యర్థిగా చూడాలని ఆశిస్తున్నారు.
  • బైడెన్‌ పోటీ నుంచి నిష్ర్కమించిన సమయంలో డెమొక్రట్ల పరిస్థితి దాదాపు ఓటమికి చేరువలో ఉంది. అయితే, ట్రంప్‌ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పార్టీ శ్రేణులు త్వరగానే హారిస్‌కు మద్దతుగా నిలిచాయి. అంతే వేగంగా అభ్యర్థిత్వ రేసులో దూసుకెళ్లిన ఆమె తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. మొదట్లో బైడెన్‌ వయసు ఆందోళన పెట్టినప్పటికీ కమల రాకతో పరిస్థితులు తారుమారయ్యాయి.
  • అమెరికాలో మహిళలు అబార్షన్‌ చేయించుకోవడాన్ని రాజ్యాంగ హక్కుగా కల్పిస్తూ గతంలో వెలువడిన తీర్పును సుప్రీం కోర్టు రెండేళ్ల క్రితం రద్దు చేసింది. ఆ తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవే కావడం వల్ల ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అబార్షన్ హక్కుల రద్దుపై ఆందోళన చెందుతున్నవారు హారిస్‌కు మద్దతుగా ఉన్నారు. మరోవైపు మొదటి మహిళా అధ్యక్షురాలిగా నిలిచేందుకు చేస్తున్న ప్రయత్నం ద్వారా మహిళా ఓటర్లలో ఆమెకు ఆదరణ లభించొచ్చు.
  • విద్యాధికులు, వృద్ధులు వంటివారు హారిస్​కు మద్దతిస్తున్నారు. ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనే ఈ వర్గాలతో డెమొక్రట్లు అధిక ప్రయోజనం పొందుతున్నారు. యువత, కళాశాల డిగ్రీలు లేనివారు ట్రంప్‌నకు అనుకూలంగా ఉన్నప్పటికీ పోలింగ్‌లో వారి భాగస్వామ్యం తక్కువే.
  • అమెరికన్ ఎన్నికలు ఖరీదైన వ్యవహారం. ఖర్చుల విషయానికి వస్తే హారిస్ అగ్రస్థానంలో ఉన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ విశ్లేషణ ప్రకారం 2023 నుంచి ట్రంప్ సేకరించిన దానికంటే జులైలో బరిలో దిగిన హారిస్‌ ఎక్కువ నిధులు కూడగట్టారు. ప్రకటనల కోసం ఆమె దాదాపు రెండు రెట్లు ఎక్కువ ఖర్చు చేసినట్లు తేలింది. స్వింగ్ రాష్ట్రాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుందనే వాదనలు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details