India US Relations :అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచిన భారత్ పై పెద్దగా ప్రభావమేమీ ఉండదని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు అపర్ణా పాండే వెల్లడించారు. అమెరికా అధ్యక్షులుగా డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీలో ఎవరు ఎన్నికైనా భారత సంబంధాల విషయంలో పెద్ద మార్పులేవీ ఉండవని విశ్లేషించారు. మూడు దశాబ్దాలుగా భారత్- అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చాలా బలోపేతం అయ్యాయని గుర్తు చేశారు. అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ సంబంధాలకు ఎలాంటి ఢోకా లేదని అపర్ణ పాండే స్పష్టం చేశారు.
బలంగా ద్వైపాక్షిక సంబంధాలు
అమెరికాలో ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ నుంచి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా భారత్- అమెరికా ఆర్థిక, వాణిజ్య, రక్షణ, వ్యూహాత్మక సంబంధాల్లో మార్పులు ఉండబోవని అపర్ణా పాండే వెల్డించారు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్ నుంచి ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్ భారత్‌లో పర్యటించారని గుర్తు చేశారు.
మూడున్నర దశాబ్దాలుగా ప్రతి భారత ప్రధానమంత్రి అనేకసార్లు అమెరికాలో పర్యటించారని తెలిపారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య సంబంధాలు చాలా బలోపేతం అయ్యాయని వెల్లడించారు. అమెరికా జాతీయ భద్రతా వ్యూహానికి భారత్ కీలకమని చెప్పారు. ఆర్థిక, రక్షణ రంగంలో కూడా అగ్రరాజ్యానికి భారత్ కీలక భాగస్వామని ఆమె అన్నారు. చైనాకు ధీటుగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ను అమెరికా ఏమాత్రం పక్కకు పెట్టే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.
ఇండో-పసిఫిక్ వ్యూహం
ఇండో-పసిఫిక్ వ్యూహాన్ని ట్రంప్ పరిపాలనలో ప్రారంభించారు. మళ్లీ ట్రంప్ అధ్యక్షుడు అయితే ఇండో-పసిఫిక్ వ్యూహంలో ఎలాంటి మార్పు ఉండకపోగా, అది మరింత బలోపేతం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటారు. క్వాడ్‌లోనూ భారత్ కీలక భాగస్వామిగా ఉంది. ట్రంప్ పాలనలో భారత వాణిజ్య భాగస్వామ్యం కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కానీ హారిస్ అధ్యక్షురాలు అయితే వాణిజ్యం సమస్యగా మారకపోవచ్చని అపర్ణ తెలిపారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, మతస్వేచ్ఛపై కాస్త సంఘర్షణ జరిగే అవకాశం లేకపోలేదని చెప్పారు.
రక్షణ పరంగా భారత్ బలంగా ఉండాలంటే వ్యూహాత్మకంగా బంగ్లాదేశ్ కీలకం. చైనా సరిహద్దు దేశం కాబట్టి బంగ్లాలో పట్టు నిలుపుకోవాలని అమెరికా కూడా చూస్తోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ విషయంలో భారత్ సహకారంతో అమెరికా కొత్త ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌పై అమెరికా, భారత్ కొద్దిగా భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నాయని అపర్ణ చెబుతున్నారు.