తెలంగాణ

telangana

ETV Bharat / international

కమలా హారిస్‌కే భారతీయ అమెరికన్ల మద్దతు - కానీ, అప్పటి కంటే తక్కువే! - US ELECTIONS 2024

కమలా హారిస్​కు 61 శాతం మంది భారతీయ అమెరికన్ల మద్దతు - ట్రంప్​నకు 31 శాతం

US Elections 2024 Survey
US Elections 2024 Survey (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2024, 2:26 PM IST

US Elections 2024 Survey :హోరాహోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో భారతీయ అమెరికన్ల మద్దతు డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌కే ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. 61 శాతం మంది భారతీయ అమెరికన్లు హారిస్‌ వైపే ఉన్నారని ఓ సర్వే వెల్లడించింది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు 31 శాతం మంది మద్దతు ఉందని తెలిపింది. అయితే 2020తో పోలిస్తే రిపబ్లికన్‌ అభ్యర్థికి భారతీయ అమెరికన్ల మద్దతు 22 శాతం నుంచి 31 శాతానికి పెరగడం డెమొక్రాట్లను ఆందోళనకు గురి చేస్తోంది.

నవంబర్‌ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజేతగా నిలుస్తారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక సర్వేలు వెలువడ్డాయి. తాజాగా భారతీయ-అమెరికన్ల మొగ్గు ఎవరివైపు ఉంది అనే దానిపై ఇండియన్‌ అమెరికన్‌ ఆటిట్యూడ్‌ సర్వే వెలువడింది. యూగౌ భాగస్వామ్యంలో కార్నెగీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో 61 శాతం మంది భారతీయ అమెరికన్లు డెమొక్రాటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ వైపు మొగ్గు చూపగా, 31 శాతం మంది రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌నకు మద్దతునిచ్చారు.

డెమొక్రటిక్​ పార్టీకి తగ్గిన మద్దతు
అయితే, ఈ సర్వే డెమొక్రాట్లకు ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే 2020తో పోల్చుకుంటే డెమొక్రాట్లకు భారతీయ అమెరికన్ల మద్దతు తగ్గడమే అందుకు కారణం. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌కు 68 శాతం ఇండియన్‌ అమెరికన్లు మద్దతునివ్వగా ట్రంప్‌నకు 22 శాతం మంది మాత్రమే అండగా నిలిచారు. ఈ నాలుగేళ్లలో ట్రంప్‌నకు మద్దతునిచ్చే భారతీయ అమెరికన్ల సంఖ్య 22 శాతం నుంచి 31 శాతానికి పెరిగింది.

ఇదే తొలిసారి
40 ఏళ్లలోపు ఇండియన్‌ అమెరికన్‌ పురుషుల్లో 48 శాతం ట్రంప్‌వైపు నిలవగా, 44 శాతం మంది మాత్రమే హారిస్‌వైపు మొగ్గు చూపడం గమనార్హం. ఎలక్టోరల్‌ చరిత్రలోనే ఇలా భారతీయ యువకులు రిపబ్లికన్‌ అభ్యర్థివైపు మొగ్గుచూపడం ఇదే తొలిసారి. ఇక అమెరికాలోనే పుట్టిన భారత సంతతివారిలో ట్రంప్‌నకు మద్దతు ఎక్కువగా ఉంది. అయితే అన్ని వయసులకు చెందిన మహిళల్లో ట్రంప్‌తో పోల్చుకుంటే హారిస్‌కే ఎక్కువ మద్దతు ఉండటం గమనార్హం. సెప్టెంబర్‌ మధ్య నుంచి అక్టోబర్‌ మధ్య వరకు ఈ సర్వేను నిర్వహించారు.

అనేక రంగాల్లో కీలక పాత్ర
అమెరికాలో 52 లక్షల మంది భారత సంతతి ప్రజలు ఉన్నట్లు అంచనా. వీరిలో 26 లక్షల మందికి అమెరికా పౌరసత్వం ఉంది. మెక్సికల్‌ అమెరికన్ల తర్వాత ఇండియన్‌ అమెరికన్లదే రెండో అతిపెద్ద వలస గ్రూప్‌. 2010 తర్వాత అమెరికాలో భారత సంతతి ప్రజల సంఖ్య 50 శాతం పెరిగింది. అమెరికాలో భారత సంతతివారి సగటు వార్షిక ఆదాయం లక్షా 53 వేల డాలర్లుగా ఉంది. ఇది అమెరికా జాతీయ సగటు కంటే రెట్టింపు కావడం గమనార్హం. అనేక రంగాల్లో భారతీయ-అమెరికన్లు కీలక పాత్ర పోషిస్తున్నారు

ABOUT THE AUTHOR

...view details