South Korean President Apology :మార్షల్ లా విధించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించినందుకు తనను క్షమించాలంటూ తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కోరారు. ఇటువంటి తప్పు మరోసారి చేయనని వెల్లడించారు. శనివారం పార్లమెంటులో ఆయనపై వచ్చిన అభిశంసన తీర్మానంపై ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఓ టెలివిజన్ ఛానల్‌లో ప్రసంగిస్తూ యూన్ ఇలా బహిరంగ క్షమాపణ చెప్పారు.
"ఆ ప్రకటన కోసం నా రాజకీయ, చట్టపరమైన బాధ్యతను తప్పించుకోలేను. మార్షల్ లా కారణంగా ప్రజలను ఆందోళనకు అలాగే తీవ్ర అసౌకర్యానికి గురిచేసినందుకు నేను మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఇంకోకసారి ఇలా ఎమర్జెన్సీ విధించే ప్రయత్నం చేయనని మీకు హామీ ఇస్తున్నాను" అని అధ్యక్షుడు యూన్ పేర్కొన్నారు.
ఏం జరిగిందంటే :
ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ యూన్ సుక్ యోల్ ఇటీవల సౌత్ కొరియాలో 'ఎమర్జెన్సీ మార్షల్ లా' విధించారు. అయితే విధించిన కొద్ది గంటలకే దీనిపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడి పెద్ద ఎత్తున తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పార్లమెంట్‌లో ఓటింగ్ పెట్టి అత్యవసర స్థితికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించారు. అలా గంటల వ్యవధిలోనే అమలైన ఎమర్జెన్సీని ఎత్తివేశారు. ఈ క్రమంలో చేసేదేం లేక వెనక్కితగ్గిన అధ్యక్షుడు ఇలా తన ప్రకటనను విరమించుకున్నట్లు తెలిపారు.