Philippines Floods Death Toll :ఫిలిప్పీన్స్‌లో ఉష్ణమండల తుపాను ట్రామీ బీభత్సం సృష్టించింది. ఈ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడి మృతి చెందినవారి సంఖ్య శనివారంనాటికి 85కి చేరింది. అలాగే మరో 41 మంది గల్లంతయ్యారు. తప్పిపోయినవారి కోసం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఏడాదిలో ఇదే అత్యంత భీకరమైన తుపాను
శుక్రవారం నుంచి వాయువ్య ఫిలిప్పీన్స్‌ను ట్రామీ తుపాను అతలాకుతలం చేస్తోంది. ఈ ఏడాదిలో ఫిలీప్పీన్స్‌లో సంభవించిన అత్యంత విధ్వంసర తుపాను ట్రామీనే. ఈ తుపాను ధాటికి ఇప్పటికే 85మంది మరణించగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సిబ్బంది, స్నిఫర్ డాగ్‌ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. బటాంగాస్ ప్రావిన్స్ తాలిసేలో శిథిలాల కింద కూరుకుపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని అధికారులు శనివారం బయటకు తీశారు.
ఫిలిప్పీన్స్‌లో ట్రామీ తుపాను (Associated Press) 'రెండు నెలల్లో కురవాల్సిన వర్షం 24 గంటల్లోనే'
వరద ప్రభావిత ప్రాంతాలను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ శనివారం సందర్శించారు. రెండు నెలల్లో కురవాల్సిన వర్షం కేవలం 24 గంటల్లోనే నమోదైందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో వరదలు తగ్గాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉందని వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా పూర్తికాలేదని, సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోందని వివరించారు. పెద్దపెద్ద ట్రక్కులను వరద ప్రాంతాల్లో తీసుకెళ్లలేకపోతున్నామని తెలిపారు.
ఫిలిప్పీన్స్‌లో ట్రామీ తుపాను విధ్వంసం (Associated Press) వరదల్లో చిక్కుకున్న 50లక్షల మంది
50 లక్షల మందికిపైగా ప్రజలు తుపాను వల్ల ఇబ్బందులు పడుతున్నారని అధికారులు తెలిపారు. వారిలో 5లక్షల మంది అనేక ప్రావిన్సులలోని 6,300 వరద సహాయక కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో 11తుపానులు ఫిలిప్పీన్స్‌ను తాకాయని వెల్లడించారు. వచ్చే వారం ట్రామీ తుపాను తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో దక్షిణా చైనా సముద్రంలో భారీ గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. తుపాను దిశను మార్చుకోకపోతే వియత్నాం వైపు మళ్లుతుందని పేర్కొన్నారు. మరోవైపు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.
సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది (Associated Press) ఏటా 20 తుపానులు
పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ చైనా సముద్రం మధ్య ఉన్న ఫిలిప్పీన్స్‌ను ప్రతి ఏటా 20 తుపానులు తాకుతున్నాయి. దీంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మంది నిరాశ్రయులు అవుతున్నారు. కాగా, 2013లో హైయాన్ తుపాను ధాటికి ఫిలీప్పీన్స్ లో 7,300 మంది ప్రాణాలు విడిచారు.
ట్రామీ తుపాను బీభత్సం (Associated Press) తుపాను కారణంగా ధ్వంసమైన ఇళ్లు (Associated Press)