Turkish Armament Factory Blast : తుర్కియేలోని ఆయుధ తయారీ కేంద్రంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గాయపడినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ బల్కిసెర్ ప్రావిన్స్‌లోని కవక్లి అనే పట్టణ శివార్లలో ఉంది. దీనిలో మందుగుండు, ఫ్లేయర్స్, ఇతర ఆయుధాలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు.
తుర్కియే కాలమానం ప్రకారం ఉదయం 8.25 నిమిషాలకు జరిగిన ఈ పేలుడు దెబ్బకు భారీ అగ్నిగోళం గాల్లోకి ఎగసింది. జెఎస్ఆర్ ఎక్స్‌ప్లోజీవ్స్ ఫ్యాక్టరీలోని ప్రధాన భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది. చుట్టుపక్కల భవనాలు కూడా దెబ్బతిన్నాయి. దీనిని క్యాప్సుల్ ప్రొడెక్షన్ విభాగంగా పేర్కొంటున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు ఆ దేశ ఇంటీరియర్ మంత్రి వెల్లడించించారు. ఇప్పుడే ప్రమాదానికి గల కారణాలను వెంటనే చెప్పలేమన్నారు.
పేలుడు జరిగిన వెంటనే భారీగా అగ్నిమాపక సిబ్బంది అంబులెన్స్‌లు అక్కడికి చేరుకొన్నాయి. ప్రమాదం జరిగిన వేళ ఫ్యాక్టరీలో ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు అధికారులు యత్నిస్తున్నారు.