తెలంగాణ

telangana

ETV Bharat / international

అటోమెటిక్​ పౌరసత్వం రద్దుపై కోర్టు స్టే- అప్పీల్‌కు వెళ్తామన్న ట్రంప్‌ - BIRTHRIGHT CITIZENSHIP RULING

అమెరికా అధ్యక్షుడికి చుక్కెదురు!- జన్మతః పౌరసత్వ రద్దు ఆదేశాలపై కోర్టు స్టే - అప్పీల్​కు వెళ్తానన్న డొనాల్డ్​ ట్రంప్‌

Trump Appeal On Birthright Citizenship Ruling
Trump Appeal On Birthright Citizenship Ruling (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2025, 9:23 AM IST

Updated : Jan 24, 2025, 9:48 AM IST

Trump Appeal On Birthright Citizenship Ruling :వలస వచ్చిన వారి సంతానానికి అటోమెటిక్​గా అమెరికా పౌరసత్వం కల్పించే హక్కును రద్దు చేస్తూ దేశాధ్యక్షుడు ట్రంప్‌ ఇచ్చిన కార్యనిర్వాహక ఆదేశాల(ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్)ను సియాటిల్‌ ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే దీనిపై తప్పకుండా అప్పీల్‌కు వెళ్తామని ట్రంప్ ప్రకటించారు. గురువారం వాషింగ్టన్‌లోని ఓవల్‌ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు.

దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే ట్రంప్ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేశారు. వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతః(అమెరికా గడ్డపై పుట్టిన వారికి అటోమెటిక్​గా వచ్చే) కల్పించే పౌరసత్వాన్ని రద్దు చేసే ఉత్తర్వు ఇందులో ఒకటి. దీన్ని విపక్ష డెమొక్రటిక్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ పార్టీ పాలనలో ఉన్న వాషింగ్టన్‌, ఆరిజోనా, ఇల్లినాయిస్‌, ఓరెగన్‌ రాష్ట్రాలు సియాటిల్‌ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం పౌరసత్వ చట్టం నిబంధనలకు ట్రంప్‌ ఆదేశాలు వ్యతిరేకమని వాదించాయి. అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం ఇవ్వాల్సిందేనని న్యాయవాదులు వాదించారు. గతంలో పలు కేసులను విచారించే క్రమంలో ఈ అంశాన్ని అమెరికా సుప్రీంకోర్టు కూడా బలపర్చిందని గుర్తుచేశారు.

ఈ వాదనలు విన్న సియాటిల్‌ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి జాన్‌ కాఫ్నర్‌, ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ అమెరికాలోని 22 రాష్ట్రాల పరిధిలో మొత్తం 5 న్యాయ వ్యాజ్యాలు కోర్టుల్లో దాఖలయ్యాయి. వాటిలో ఒక దానిపై సియాటిల్‌ ఫెడరల్ కోర్టు విచారణ జరిపింది. మరో నాలుగు న్యాయ వ్యాజ్యాలపై తదుపరిగా విచారణ జరగనుంది. 2022 సంవత్సరం గణాంకాల ప్రకారం, ఆ ఏడాది అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీ మహిళలకు 2.55 లక్షల మంది పిల్లలు జన్మించారు. అదే ఏడాది దేశంలో అక్రమంగా నివసిస్తున్న దంపతులకు 1.53 లక్షల మంది పిల్లలు జన్మించారు. తదుపరిగా విచారణకు రానున్న వ్యాజ్యాల్లో ఈ వివరాలను ప్రస్తావించారు.

1868 సంవత్సరంలో కీలక రాజ్యాంగ సవరణ
18వ శతాబ్దంలో అమెరికాలో అంతర్యుద్ధం (సివిల్ వార్) జరిగింది. అది ముగిసిన తర్వాత 1868 సంవత్సరంలో దేశ రాజ్యాంగంలో కీలక సవరణకు ఆమోదం తెలిపారు. అమెరికా గడ్డపై జన్మించే వారందరికీ దేశ పౌరసత్వం కల్పించాలని అందులో స్పష్టంగా పొందుపరిచారు. జన్మతః పౌరసత్వం కల్పించడం అనేది ఒక్క అమెరికాలోనే లేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 33 దేశాలు ఈ తరహాలో పౌరసత్వం కల్పిస్తున్నాయి. ఈ జాబితాలో పాకిస్థాన్, బ్రెజిల్, కెనడా, మెక్సికో, వెనెజులా, పనామా వంటి దేశాలు ఉన్నాయి.

సుప్రీంకోర్టు కూడా సమర్థించిన కేసు ఇదీ
వాంగ్ కిమ్ ఆర్క్ అనే వ్యక్తి జన్మతః పౌరసత్వంతో ముడిపడిన ఒక కేసు 1898లో అమెరికా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. దాన్ని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం- ''వాంగ్ కిమ్ ఆర్క్ అనే వ్యక్తి చైనాకు చెందిన దంపతులకు, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో గడ్డపై జన్మించాడు. అందువల్ల అతడు అమెరికా పౌరుడే" అని స్పష్టం చేసింది. వాంగ్ కిమ్ ఆర్క్ విదేశీ టూర్‌కు వెళ్లి వస్తుండగా, దేశంలోకి ప్రవేశించకుండా అమెరికా ఇమిగ్రేషన్ విభాగం అతడిని అడ్డుకోవడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. అమెరికాలోకి చైనా కార్మికుల ప్రవేశాలను అడ్డుకునేందుకు రూపొందించిన 'చైనీస్ ఎక్స్‌క్లూషన్ చట్టాన్ని' సాకుగా చూపించి వాంగ్ కిమ్ ఆర్క్‌ను దేశంలోకి రానివ్వకపోవడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది.

Last Updated : Jan 24, 2025, 9:48 AM IST

ABOUT THE AUTHOR

...view details