Russia Debt Forgiveness :ఉక్రెయిన్‌పై పోరుకు సైనిక సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు రష్యా వీలైనన్ని మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా కొత్తగా సైన్యంలో చేరేవారి రుణాలకు క్షమాభిక్ష ప్రసాదించే చట్టంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేశారు. ఈ చట్టం ద్వారా- సంవత్సరం పాటు సైన్యంలో పనిచేయడానికి సిద్ధపడేవారికి కోటి రూబుల్స్ వరకు (సుమారు రూ.80 లక్షలు) రుణమాఫీ చేస్తారు. లోన్ వసూలుకు కోర్టు ఉత్తర్వులు జారీ అయి, ఈ ఏడాది డిసెంబరు 1వ తేదీలోగా చర్యలు మొదలయ్యేవారికి ఇది వర్తిస్తుంది. రుణగ్రహీతల జీవిత భాగస్వాముల అప్పులకు కూడా ఇది వర్తిస్తుంది. సైన్యంలోకి కొత్తవారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న రష్యా, ఇప్పటికే పలు రకాల ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది. సగటు జీతం కంటే అనేక రెట్లు ఎక్కువ ఇస్తామని కొందరికి చెబుతోంది.
సైన్యంలో చేరితే రూ.80 లక్షల వరకు రుణమాఫీ - జీవిత భాగస్వాముల అప్పుల బాధ్యత ప్రభుత్వానిదే! - RUSSIA DEBT FORGIVENESS
సైనిక సామర్థ్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న రష్యా - ఆర్మీలో చేరేవారికి రూ.80 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటన - కొత్త చట్టంపై పుతిన్ సంతకం
Published : Nov 25, 2024, 7:26 AM IST
యెమెన్ వాసుల్ని కూడా
రష్యా ఇటీవల ఉత్తర కొరియా సైనికులను ఉక్రెయిన్ యుద్ధ రంగంలో మోహరించింది. అలాగే తాజాగా యెమెన్ వాసులను కూడా తీసుకొచ్చినట్లు తెలుస్తుందో. తొలుత యెమెన్ పౌరులను రష్యాకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి బలవంతంగా సైన్యంలోకి చేర్చుకుని సరిహద్దులకు పంపిస్తున్నారని అక్కడ పనిచేస్తున్న యెమెన్ వాసులు ధ్రువీకరిస్తున్నారు. మంచి జీతంతో కూడిన ఉద్యోగం, రష్యా పౌరసత్వం ఇస్తామంటే వచ్చామని వారు వాపోతున్నారు.
నాటో లక్ష్యంగా రష్యా సైబర్ దాడులు
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న వేళ నాటో దేశాలపై మాస్కో సైబర్ దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నాటో సైబర్ డిఫెన్స్ కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేయనున్నారు. రష్యా చేయనున్న సైబర్ యుద్ధం అస్థిరతను, బలహీనతను కలిగిస్తుందని, ఈ దాడులు ఉక్రెయిన్‌తో రష్యా చేసే రహస్య యుద్ధమని బ్రిటన్ మంత్రి తెలిపారు. సైబర్ రంగంలో రష్యా అనూహ్యంగా దూకుడుగా ఉందని దాని తీవ్రతను తక్కువగా అంచనా వేయకూడదని తెలిపారు. అటు సైబర్‌దాడులకు దిగే విభాగాన్ని రష్యా యూనిట్ 29155గా గుర్తించారు. ఇది రష్యన్ సైనిక గూఢచార విభాగం. ఈ విభాగం గతంలోనే యూకేతో పాటు ఐరోపా అంతటా అనేకసార్లు సైబర్ దాడులు చేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు.