తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉక్రెయిన్‌ పవర్‌గ్రిడ్స్‌ టార్గెట్​- క్రూయిజ్ మిసైల్స్‌, డ్రోన్స్‌తో రష్యా భీకర దాడి - RUSSIA ATTACK ON UKRAINE

డజన్ల కొద్దీ క్రూయిజ్ మిసైల్స్‌, డ్రోన్స్‌తో - ఉక్రెయిన్‌ పవర్‌గ్రిడ్స్‌పై రష్యా ఎటాక్‌

Russia Ukraine War Updates
Russia Ukraine War Updates (AP)

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2024, 2:01 PM IST

Updated : Dec 13, 2024, 2:51 PM IST

Russia Attack On Ukraine :ఉక్రెయిన్‌కు చెందిన విద్యుత్‌ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని రష్యా భీకర దాడులు చేస్తోంది. ఉక్రెయిన్‌పై డజన్ల కొద్దీ క్రూయిజ్ మిసైల్స్‌, డ్రోన్లను శుక్రవారం ప్రయోగించింది. ఈ విషయాన్ని ఎనర్జీ మినిస్టర్‌ హెర్మన్‌ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. "రష్యా మిలటరీ ఉక్రెయిన్‌ పవర్‌గ్రిడ్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. మా శత్రువు (రష్యా) బీభత్సాన్ని కొనసాగిస్తోంది" అని ఇంధన మంత్రి హెర్మన్‌ హలుష్చెంకో తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు పెట్టారు. మరోవైపు ఉక్రెయిన్ వైమానిక దళం కూడా రష్యా దాడులను ధ్రువీకరించింది. ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలపై రష్యా ఎయిర్‌-లాంఛ్డ్‌ బాలిస్టిక్‌ కింజాల్ క్షిపణులను ప్రయోగించినట్లు పేర్కొంది.

చలికి ప్రజలను బలి చేయడమే లక్ష్యం!
రష్యా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా తరచూ దాడులు చేస్తూనే ఉంది. శీతాకాలంలో ఉక్రెయిన్‌ ప్రజలను చలికి బలి చేయడమే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్‌లో చలికాలంలో కచ్చితంగా హీటర్లు అవసరం. చివరికి తాగే నీళ్లు కూడా వేడి చేసుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ కేంద్రాలు కనుక విధ్వంసం అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడం ఖాయం. అందుకే రష్యా పవర్‌గ్రిడ్‌లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నట్లు భావిస్తున్నారు.

ఆగని దాడులు
ఇటీవల వందల కొద్దీ గ్లైడ్‌ బాంబులను రష్యా తమ దేశంపై ప్రయోగించిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించిన సంగతి తెలిసిందే. 800 కేఏబీ శ్రేణికి చెందిన 1500 కేజీల బరువు ఉన్న బాంబులతో దాడులు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు మరోసారి రష్యా భారీగా డ్రోన్లను ప్రయోగించింది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌పై ఆక్రమణకు పాల్పడిన రోజే తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను యుద్ధంలో వాడేందుకు రష్యా సిద్ధంగా ఉందని రష్యా నుంచి పారిపోయిన ఓ సైనికుడు వెల్లడించడం గమనార్హం.

సైన్యంలో చేరితే రుణమాఫీ
మరోవైపు, ఉక్రెయిన్‌పై పోరుకు సైనిక సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు రష్యా వీలైనన్ని మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా కొత్తగా సైన్యంలో చేరేవారి రుణాలకు క్షమాభిక్ష ప్రసాదించే చట్టంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంతకం చేశారు. ఈ చట్టం ద్వారా- సంవత్సరం పాటు సైన్యంలో పనిచేయడానికి సిద్ధపడేవారికి కోటి రూబుల్స్‌ వరకు (సుమారు రూ.80 లక్షలు) రుణమాఫీ చేస్తారు.

Last Updated : Dec 13, 2024, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details