Russia Elections 2024: రష్యాలో మరోసారి వ్లాదిమిర్ పుతిన్ భారీ ఆధిక్యంతో అధ్యక్ష పీఠంపై కూర్చొనున్నట్లు స్పష్టం అయింది. ఇప్పటివరకు 24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును చేపట్టగా, పుతిన్‌కు దాదాపు 88శాతం ఓట్లు లభించినట్లు రష్యా ఎన్నికల సంఘం తెలిపింది. 3 రోజులుగా జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసింది.
భారీ మెజారిటీతో పట్టం
ప్రాథమిక సమాచారం ప్రకారం మూడు రోజుల పాటు జరిగిన ఈ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 74.22 శాతం ఓటింగ్ నమోదయ్యింది. అందులో పుతిన్‌కు అత్యధికంగా 88శాతం ఓట్లను లభించినట్లు సమాచారం. పుతిన్‌కు పోటీగా బరిలో ఉన్న న్యూ పీపుల్ పార్టీ వ్లాదిస్లవ్ డవాంకోవ్ 4.8శాతం ఓట్లు లభించాయి. మరో అభ్యర్థి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నికోలోయ్ ఖరితోనోవ్ 4.1శాతం, లిబరల్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన లియోనిడ్ స్లట్‌స్కీకి 3.15 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ఇప్పటికే నాలుగు సార్లు అధ్యక్షుడిగా ఉన్న పుతిన్ మరోసారి పీఠాన్ని అధిరోహించనున్నారు.
చివరి రోజు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. పుతిన్ విధానాలను వ్యతిరేకిస్తున్నవారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి సంఘీభావం ప్రకటించాలని దివంగత విపక్ష నేత నావల్నీ మద్దతుదారులు పిలుపునిచ్చారు. దీంతో ఉక్రెయిన్ యుద్ధం, పుతిన్ వ్యతిరేకులు, దివంగత విపక్ష నేత మద్దతుదారులంతా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పుతిన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి బ్యాలెట్ పెట్టెల్లోకి ఇంకును పోశారు. 16 నగరాల్లో 65 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టుచేశారు. ఫలితంగా ప్రత్యర్థులు, బహిరంగం విమర్శకులు లేని కఠిన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ఓటర్ల వెల్లువకు సంబంధించిన చిత్రాలను నావల్నీ మద్దతుదారులు సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. అటు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ పలు చోట్ల రష్యా భూభాగంపై డ్రోన్లుతో దాడులు చేసింది. ఈ దాడిలో ఇద్దరు మరణించగా, మరో 11 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరణించిన వారిలో 16 ఏళ్ల బాలిక ఉందని పేర్కొన్నారు.