Protests At US Universities : గాజాపై దండెత్తిన ఇజ్రాయెల్‌కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా పాలస్తీనాకు మద్దతుగా వర్సిటీల్లో జరుగుతున్న ఆందోళనలు ఉద్ధృతరూపం దాలుస్తున్నాయి. తరగతులను బహిష్కరించిన విద్యార్థులు పాలస్తీనాకు అనుకూలంగా గుడారాలు వేసి ప్లకార్డులు పట్టుకుని నిరసన చేస్తున్నారు. పలు యూనివర్సిటీల్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులను అరెస్టు చేశారు.
550 మంది విద్యార్థులు అరెస్ట్
దేశవ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీల్లో ఈ వారం రోజుల్లో సుమారు 550 మంది విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. బోస్టన్‌లోని ఎమర్సన్ కళాశాలలో 108 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో నలుగురు పోలీసులకు గాయాలయినట్ల తెలుస్తోంది. బుధవారం రాత్రి సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో 93 మంది అరెస్టయినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఆందోళనలకు కేంద్రంగా ఉన్న కొలంబియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అక్కడి విద్యార్థులతో అధికారులు చర్చలు జరుపుతున్నారు.
ఆందోళనలు తీవ్రరూపం!
న్యూయార్క్ కొలంబియా విశ్వవిద్యాలయంలో 100 మందికిపైగా నిరసనకారుల అరెస్ట్ అనంతరం ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. గురువారం జార్జియాలోని అట్లాంటాలో ఎమోరీ విశ్వవిద్యాలయంలో 20 మంది కమ్యూనిటీ సభ్యులతో సహా పలువురిని అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇండియానా వర్సిటీలో సుమారు 33 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. కొందరు నిరసనకారులు బాటిళ్లు విసరడం వల్ల వారిని అదుపు చేసేందుకు పోలీసులు పెప్పర్ బాల్స్‌ను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇండియానా వర్సిటీ క్యాంపస్‌లో టెంట్లు వేయొద్దని ఎన్ని సార్లు హెచ్చరించినా విద్యార్థులు పట్టించుకోలేదని, దీంతో వాళ్లను అరెస్టు చేయాల్సి వచ్చినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.