Pregnant Delivery In Flight : విమానంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి పైలట్ విజయవంతంగా డెలివరీ చేశారు. ఈ అనూహ్య ఘటన తైవాన్ నుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న వీట్‌జెట్‌కు చెందిన విమానంలో జరిగింది.
అసలేం జరిగిందంటే?
తైవాన్ నుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న విమానంలో ఒక గర్భిణి ఉంది. టేకాఫ్ అయిన కాసేపటికి ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. బాత్రూమ్లో ఆమెను చూసిన సిబ్బంది ఈ విషయాన్ని పైలట్ జాకరిన్‌కు తెలియజేశారు. ల్యాండింగ్‌కు ఇంకా సమయం ఉండడం వల్ల గర్భిణికి డెలివరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమయానికి విమానంలో వైద్యులు కూడా లేకపోవడం వల్ల పైలట్ తల్లీబిడ్డలను కాపాడే ప్రయత్నం చేశారు. ముందుగా తన బాధ్యతలను కో-పైలట్‌కు అప్పగించారు. సెల్‌ఫోన్ ద్వారా వైద్యులను సంప్రదించిన పైలట్, వారి సూచనలతో గర్భిణికి పురుడు పోశారు.
చిన్నారికి ముద్దుగా 'స్కై' అని నామకరణం
పైలట్ జాకరిన్ చేసిన పనికి తోటి ప్రయాణికులంతా ప్రశంసలు కురిపించారు. విమానంలో జన్మించిన ఈ చిన్నారికి సిబ్బంది ముద్దుగా 'స్కై' అని పేరు పెట్టారు. ల్యాండింగ్ అనంతరం తల్లీబిడ్డలను వైద్య సిబ్బంది పరీక్షించారు. వారు ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్లుగా పైలట్‌గా వ్యవహరిస్తున్న జాకరిన్ గతంలో ఎప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కోలేదని చెప్పారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ట్రావెల్ మెడిసిన్ 2020లో చేసిన అధ్యయనం ప్రకారం 1929 నుంచి 2018 మధ్య వివిధ విమానాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. మొత్తం విమానంలో 74 మంది చిన్నారులు జన్మించగా అందులో 71 మంది సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది.
డెలివరీ చేసిన కండక్టర్
ఓ లేడీ కండక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇద్దరి ప్రాణాలు కాపాడారు. కదులుతున్న బస్సులో ఉన్నట్టుండి ఓ గర్భిణికి పురిటి నొప్పులు రాగా కండక్టర్ ఆమెకు సహాయం చేసి నార్మల్ డెలివరీ అయ్యేటట్టు కొన్నాళ్ల క్రితం చేశారు. ఆర్థిక సమస్యల కారణంగా ఆ గర్భిణి ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి వెళ్లలేక కేఎస్‌ఆర్‌టీసీ బస్సులో ప్రయాణించింది. విషయం తెలుసుకున్న కండక్టర్ బస్సులోని ప్రయాణికుల వద్ద నుంచి రూ.1,500 సేకరించి ఆమెకు ఆర్థిక సహాయం చేశారు. అనంతరం ఆమె తన బిడ్డతో కలిసి అంబులెన్సులో దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి వెళ్లింది. సకాలంలో స్పందించి తల్లి, బిడ్డ ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటుకున్న కండక్టర్ గురించి తెలుసుకున్న కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కమిషనర్, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.