తెలంగాణ

telangana

అమెరికాలో మోదీ మెగా ఈవెంట్- 16వేల మంది ప్రవాస భారతీయులతో భేటీ! - PM Modi US Visit Schedule

By ETV Bharat Telugu Team

Published : Aug 15, 2024, 8:49 PM IST

PM Modi US Visit Schedule : అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. సెప్టెంబర్ 22న లాంగ్‌ ఐలాండ్‌లో భారీ సభ జరగనుంది.

Narendra Modi Us Tour Schedule
Narendra Modi Us Tour Schedule (ANI)

PM Modi US Visit Schedule :అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రవాస భారతీయులతో భేటీ అవ్వనున్నారు. సెప్టెంబర్​లో 22వ తేదీన లాంగ్‌ ఐలాండ్‌లోని నసావు కొలీజియంలో భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. 16వేల సీటింగ్ కలిగిన ఆ కొలిజీయంలో జరిగే కార్యక్రమానికి భారీగా ప్రవాస భారతీయులు హాజరయ్యే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదేం తొలిసారి కాదు!
అయితే అమెరికాలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించడం ఇదేం తొలిసారి కాదు. 2014లో భారత ప్రధాని పదవి తొలిసారి చేపట్టిన తర్వాత న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత 2019లో హ్యూస్టన్‌లోని ఎన్​ఆర్​జీ స్టేడియంలో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి 'హౌడీ మోదీ' కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరోసారి ప్రధాని హోదాలో!
2021 సెప్టెంబర్​లో వార్షిక అత్యున్నత స్థాయి యూఎన్​జీఏ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు మోదీ. గత ఏడాది జూన్ 21వ తేదీన యూఎన్ ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ఏడాది జూన్ నెలలొ మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ, ఇప్పుడు మరోసారి ప్రధాని హోదాలో అమెరికాలో పర్యటించనున్నారు. వచ్చే నెల26 నుంచి 30వ తేదీ వరకు ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా, 26న ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ మేరకు దేశాధినేతల ప్రసంగాలకు సంబంధించిన జాబితాను ఐరాస విడుదల చేసింది.

ఆ అంశంపైనే! ఎన్నికలకు ముందే!!
మెరుగైన వర్తమానం, భవిష్యత్తుకు రక్షణ అనే అంశంపై ప్రపంచ దేశాధినేతలను ఏకాభిప్రాయానికి తీసుకు వచ్చే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఈ సదస్సు నిర్వహిస్తోంది. అంతకుముందే ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం అవ్వనున్నారు. అయితే నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. అధ్యక్ష బరిలో భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాసులతో భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ABOUT THE AUTHOR

...view details