Donald Trump latest : గోల్ఫ్ ఆడుతుండగా అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల యత్నం జరగడం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. 2 నెలల వ్యవధిలోనే ట్రంప్‌పై రెండుసార్లు కాల్పుల యత్నం జరగడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. అలాగే ట్రంప్ భద్రతపై అనుమాలను రేకెత్తిస్తోంది. ట్రంప్ గోల్ఫ్ కోర్టు కంచెలోకి నిందితుడు ఎలా వచ్చాడని ప్రశ్నలు వస్తున్నాయి.
ట్రంప్‌పై హత్యాయత్నం
ట్రంప్‌పై కాల్పులకు నిందితుడు యత్నించాడని ఎఫ్‌బీఐ సైతం తెలిపింది. అమెరికావ్యాప్తంగా ట్రంప్ ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన భద్రత గురించి సీక్రెట్ సర్వీస్ అప్రమత్తంగా ఉంటోంది. అయితే ట్రంప్ తన సొంత క్లబ్‌లు, గోల్ఫ్ కోర్టులు వంటి సొంత ప్రదేశాల్లో ఉన్నప్పుడు భద్రత తక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ట్రంప్‌కు గోల్ఫ్ అంటే ఇష్టం
సాధారణంగా ట్రంప్ ప్రచార కార్యక్రమాలు లేని రోజుల్లో గోల్ఫ్ ఆడుతుంటారు. ఆయనకు గోల్ఫ్ అంటే చాలా ఇష్టం. అందుకు తన నివాసం నుంచి 10 నిమిషాల్లో వెళ్లగలిగే ప్రదేశాల్లో మూడు గోల్ఫ్ కోర్టులను ఏర్పాటు చేసుకున్నారు. అందులో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని గోల్ఫ్ కోర్టు ఒకటి. ఈ కోర్టు విశాలంగా ఉంటుంది. ఇక్కడే ట్రంప్ ఆదివారం గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. ఆ తర్వాత పారిపోయిన నిందితుడిని పట్టుకున్నారు.
అందుకే భద్రత తక్కువ!
ట్రంప్ సిట్టింగ్ ప్రెసిడెంట్ కాకపోవడం వల్ల భద్రత కాస్త తక్కువగా ఉందని పామ్ బీచ్ కౌంటీ షరీఫ్ బ్రాడ్ షా తెలిపారు. ఒకవేళ అధ్యక్షుడిగా ఉంటే గోల్ఫ్ కోర్స్ చుట్టూ అధిక భద్రత ఉండేదని వ్యాఖ్యానించారు. లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ట్రంప్‌ను చాకచక్యంగా రక్షించారని కొనియాడారు. అలాగే అమెరికా సీక్రెట్ సర్వీస్ అద్భుతంగా పనిచేసిందని ప్రశంసించారు.
పొడవైన కంచెలు, గేటెడ్ కమ్యూనిటీల్లోని ప్రైవేట్ నివాసాల్లో అమెరికా మాజీ అధ్యక్షులు నివసించేవారు. అయితే ట్రంప్ అధికారిక నివాసం మార్ ఎ లాగో క్లబ్లో ఉంది. ఈ క్లబ్‌కు ఫీజులు చెల్లించేవారు ఎవరైనా రావొచ్చు.
పోలీసులతో కలిసి పనిచేస్తున్న ఎఫ్‌బీఐ
ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనపై దర్యాప్తు చేయడానికి పామ్ బీచ్ కౌంటీ షరీఫ్ కార్యాలయం, స్థానిక పోలీసులతో కలిసి ఎఫ్‌బీఐ కలిసి పనిచేస్తోందని సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంటోనీ గుగ్లీల్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే మాజీ అధ్యక్షుడు ట్రంప్ దగ్గరకు ఒక వ్యక్తి ఎలా రాగలిగాడనే విషయంపై అనుమానాలు ఉన్నాయని హౌస్ రిపబ్లికన్ కాన్ఫరెన్స్ చైర్ ఎలిస్ స్టెఫానిక్ తెలిపారు.
ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా కాల్పులు- ఈసారి సేఫ్! - Trump Gunshots
ట్రంప్, హారిస్ పరస్పర విమర్శలు - వాడీవేడిగా అధ్యక్ష అభ్యర్థుల డిబేట్! - US Electtions 2024