Huge Crowd at Khairatabad Metro Station : భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనం వైభవంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వేలాది గణనాథుడి విగ్రహాలు గంగమ్మ ఒడిలోకి చేరుతున్నాయి. దీంతో హుస్సేన్‌సాగర్‌లోని ట్యాంక్‌బండ్ పరిసరాలు భక్తజనంతో సందడిగా మారింది. ఈ క్రమంలో రద్దీ విపరీతంగా పెరగడంతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ గేట్లను నిర్వాహకులు మూసివేశారు. పది నిమిషాలకోసారి మెట్ల వద్ద గేట్లు తెరిచి ప్రయాణికుల్ని లోనికి అనుమతించారు. మెట్రో సిబ్బంది మెట్ల వద్ద గేట్లు మూసివేయడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత రద్దీ తగ్గాక మళ్లీ గేట్లు తెరిచి కొంతమందిని లోనికి పంపించిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌తో పాటు బస్టాప్‌లు సైతం ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మహాగణపతి నిమజ్జనాన్ని కనులారా వీక్షించేందుకు ఖైరతాబాద్‌కు భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. దీంతో ఒక్కసారిగా విపరీతమైన రద్దీ ఏర్పడింది. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఐమాక్స్ మార్గాలు సైతం కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
'మెట్రో స్టేషన్‌లో భారీగా రద్దీ ఉండడంతో మమ్మల్ని గేట్ల వద్దే ఆపేశారు. మెట్రో సిబ్బంది వెంటనే గేట్లు తెరిచి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టేషన్లోకి అనుమతివ్వాలి. మెట్రో స్టేషన్‌లో చాలా సమయం పడుతోంది. గణేశ్ నిమజ్జనం చూడాలని వస్తే ఇక్కడ మెట్రోలో ఇబ్బందులు పడాల్సి వస్తోంది'-ప్రయాణికులు
మెట్రో సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం : సాధారణ సమయంలోనే నగరంలో రద్దీ ఉంటుంది. అలాంటిది భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనం వేళ రద్దీ విపరీతంగా పెరిగింది. వినాయక చవితి పండగ మొదలైనప్పటి నుంచే మెట్రో స్టేషన్లల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. శనివారం నుంచి వరుస సెలవులతో ఖైరతాబాద్ వచ్చే భక్తులతో మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడింది. బడా గణేశ్ దర్శనం కోసం ఇటు నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో మెట్రో స్టేషన్ పరిసరాలు సందడిగా మారాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌కు ప్రయాణికులు భారీగా వచ్చారు. రద్దీకి తగ్గట్లుగా మెట్రో సిబ్బంది సర్వీసులు పెంచలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలానే జరిగిన పలు సందర్భాలు ఉన్నాయని మండిపడ్డారు.