How to Make Radhaballavi Poori: పూరీ.. చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్‌లో ఒకటి. కేవలం టిఫెన్‌గా మాత్రమే కాకుండా.. పండగల టైమ్‌లో, ఇతర సందర్భాల్లో, తినాలని అనిపించినప్పుడు కొంతమంది పూరీలు ప్రిపేర్ చేసుకొని తింటుంటారు. ఇంకా వానాకాలం అయితే, వేడివేడిగా పూరీలను చికెన్ కర్రీతో ఆస్వాదిస్తుంటారు కూడా. ఇలా ఎప్పుడు చేసినా సరే.. రొటీన్‌గా చేస్తుంటారు. అలా కాకుండా బెంగాలీ స్టైల్లో రాధా భల్లభి పూరీలను ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది. మరి బెంగాలీ పూరీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- మైదా పిండి - పావు కిలో
- నూనె - 2 టీ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- మినపప్పు - అర కప్పు
- అల్లం ముక్కలు - 1 టీ స్పూన్
- పచ్చిమిరపకాయలు - 8
- నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్
- ఉల్లి గింజలు(కలోంజి) - పావు చెంచా
- సోంపు - పావు చెంచా
- ఇంగువ - 2 చిటికెల
- పసుపు - పావు చెంచా
- కారం - ఒక చెంచా
- వేయించిన జీలకర్ర పొడి - అర చెంచా
- రుచికి సరిపడా ఉప్పు
తయారీ విధానం
- ముందుగా ఓ గిన్నెలో మైదా పిండి, నూనె, ఉప్పు వేసి బాగా కలపాలి.
- తర్వాత కొద్దిగా నీటిని పోసుకుంటూ ఎక్కువసేపు కలుపుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముద్దపై తడి క్లాత్ కప్పి 30 నిమిషాల పక్కకు పెట్టుకోవాలి.
- 4 గంటల ముందుగానే మినపప్పును నానబెట్టుకుని స్మూత్‌గా గట్టిగా మిక్సీ పట్టాలి.
- మరో మిక్సీలో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
- మరోవైపు స్టౌ ఆన్ చేసి గిన్నె పెట్టి వేడయ్యాక.. నూనె, ఉల్లిగింజలు, సోంపు, వేసి వేగనివ్వాలి.
- ఆ తర్వాత ముందుగానే పట్టుకున్న అల్లం, పచ్చిమిర్చీ పేస్ట్ వేసి వేగనివ్వాలి.
- అనంతరం ఇందులోనే ఇంగువ, పసుపు, కారం, వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి.
- ఇవన్నీ వేగాక గ్రైండ్ చేసుకున్న మినపపిండిని వేసి పాన్ నుంచి విడిపోయే వరకు మీడియం ఫ్లేమ్‌లో బాగా కలపాలి.
- సుమారు 15 నిమిషాల తర్వాత గట్టి ముద్దలా అవుతుంది. తర్వాత దీనిని పక్కను పెట్టుకుని చల్లారపెట్టుకోవాలి.
- పూరీ పిండిని ముద్దలుగా చేసుకుని వాటిపై పొడి పిండిని చల్లుకోవాలి.
- పిండి ముద్దను చేతి మణికట్టు సాయంతో ఫ్లాట్ చేసుకుని ముందే రెడీ చేసుకున్న మినపపిండి మిశ్రమాన్ని మధ్యలో పెట్టుకోవాలి.
- ఆ తర్వాత మిశ్రమం బయటికి రాకుండా అంచులను మూసి మళ్లీ ఉండలుగా చేసుకోవాలి.
- అనంతరం పొడి పిండిని తీసుకుని పూరీలాగా ఒత్తుకోవాలి.
- మరోవైపు స్టౌ ఆన్ చేసి కడాయిలో నూనెను పోసి వేడి చేసుకోవాలి.
- నూనె బాగా వేడయ్యాక అందులో పూరీలను వేస్తే అదిరిపోయే రాధాభల్లభి పూరీ రెడీ!