Ayurvedic Home Remedy to Reduce Piles Problem: శరీరంలో మనకు కనిపించే అవయవాల్లో ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే.. దాని తీవ్రత ఎలాంటిదో మన కళ్లకు కనిపించడం వల్ల దాని పరిస్థితిని అంచనా వేయగలుగుతాం. కానీ కళ్లకు కనిపించని కొన్ని భాగాల్లో కలిగే బాధ వర్ణణాతీతంగా ఉంటుంది. అలాంటి సమస్యే పైల్స్. ఇది ఎంతటి నరకాన్ని చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొందరికి సాధారణ మందులతో తక్కువయ్యే ఈ వ్యాధి.. మరికొందరిలో శస్త్రచికిత్సతో గానీ తొలగిపోదు. అది కూడా మళ్లీ తిరగబడదనే గ్యారంటీ ఉండదు. మరి ఇలాంటి సమస్యకు ఎలాంటి మందులు వాడకుండానే ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం ఉందని చెబుతున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ గాయత్రీ దేవీ. ఈ నేపథ్యంలోనే ఈ పథ్యాహారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? దీనిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
- బియ్యం -1 కప్పు
- పిప్పళ్ల పొడి- 1 చెంచా
- శొంఠి చూర్ణం - 1 చెంచా
- మజ్జిగ - గ్లాసు
- మిరియాల పొడి - 1 చెంచా
తయారీ విధానం:
- ముందుగా స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టి 10 కప్పుల నీటిని పోసి వేడి చేసుకోవాలి.
- నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక కప్పు బియ్యం వేసుకుని మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.(జావలాగా ఉడికించుకుంటే మంచిది)
- ఇలా మెత్తగా ఉడికే క్రమంలోనే శొంఠి, పిప్పళ్ల చూర్ణాన్ని అందులో కలపాలి.
- ఇవన్నీ వేశాక ఒక నిమిషం పాటు ఉడకనిచ్చి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత దీనిని ఓ గిన్నెలో తీసుకుని అందులోనే మజ్జిగ, మిరియాల పొడిని కలపితే పథ్యాహారం రెడీ!
ఎలా తీసుకోవాలి?: ఈ ఔషధాన్ని భోజనం చేసే ఏ సమయంలోనైనా తీసుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్ గాయత్రీ దేవీ. రోజులో ఒకసారి ఈ జావను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పైల్స్ సమస్యను తగ్గించుకోవచ్చని తెలుపుతున్నారు. ఒకవేళ మీరు భోజనం చేశాక మజ్జిగ అన్నం తినే వారు అయితే, దానిని మానేసి ఈ ఔషధాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.
శొంఠి: పైల్స్‌ను తగ్గించేందుకు శొంఠి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. జీర్ణశక్తి మందగించడం వల్ల పైల్స్ సమస్య వస్తుందని.. అది మెరుగపడడానికి దీనిని వాడాలని సూచిస్తున్నారు.
పిప్పళ్లు: పిప్పళ్లు కూడా జీర్ణశక్తిని మెరుగుపర్చడానికి.. అలాగే పైల్స్ సమస్యను తగ్గించడానికి ఉపయోగపడుతుందని తెలుపుతున్నారు. వీటిలో రుచితో పాటు అనేక ఔషధ గుణాలు ఉన్నాయని వివరిస్తున్నారు.
మిరియాలు: మిరియాలను అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తుంటారు. మిరియాలలో అజీర్తి సమస్యను తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇన్ఫెక్షన్లు తగ్గడానికి, శరీరంలోని మలినాలు బయటకు వెళ్లడానికి ఔషధంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
నడుము కొవ్వు తగ్గాలా? ఈ యోగాసనాలు చేస్తే ఫలితం ఉంటుందట! - Yoga Asanas for Reducing Hip Fat