Womens T20 World Cup 2024 : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ కప్‌ల్లో పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు ప్రైజ్‌మనీ అందిస్తామని ప్రకటించింది. వచ్చే నెల జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ నుంచే ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని పేర్కొంది. ఈ నిర్ణయంతో టోర్నమెంట్ ఛాంపియన్‌గా నిలిచిన జట్టు రూ.19 కోట్ల ప్రైజ్‌మనీ దక్కించుకోనుంది. గత టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీతో పోలిస్తే ఇది 134 శాతం అధికం. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.9 కోట్ల నగదు బహుమతి అందుకుంటుంది. సెమీ ఫైనల్‌లో ఓడిన రెండు జట్లకు గతంలో 2,10,000 అమెరికన్ డాలర్లు ఇవ్వగా ఇప్పుడు దానిని 6,75,000 అమెరికన్ డాలర్లకు పెంచారు. మొత్తం ప్రైజ్‌మనీ 7,958,080 అమెరికన్ డాలర్లు (రూ.66 కోట్లు). క్రితం సారితో పోలిస్తే ఇది 225 శాతం అధికం.
మహిళల టీ20 ప్రపంచ కప్ అక్టోబరు 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. వాస్తవానికి ఈ ప్రపంచ కప్ బంగ్లాదేశ్‌లో జరగాల్సింది. కానీ, అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొనడంతో ఈ టోర్నీని యూఏఈలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌లోని ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన టీమ్‌లు సెమీస్‌కు చేరతాయి. గ్రూప్ ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక గ్రూప్ బిలో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి.
భారత్ అక్టోబర్ 4న న్యూజిలాండ్, 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్‌లో జరగనుంది. అక్టోబర్ 17, 18న నిర్వహించే సెమీ ఫైనల్స్‌తోపాటు అదే 20న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంది. భారత్ సెమీస్‌కు చేరితే తొలి సెమీ ఫైనల్‌లో తలపడనుంది.
భారత జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, పుజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయంకా పాటిల్*, సంజనా సంజీవన్.